గురువారం, 27 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌: ఎం.ఎ. బేబీ

2 గంటల క్రితం

ma baby
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 27, 2026, 04:14 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

డివైఎఫ్‌ఐ త్రిపుర రాష్ట్ర కార్యదర్శి నబరున్‌ దేబ్‌ నివాసాన్ని సందర్శించిన సిపిఐ(ఎం) బృందం
అగర్తల : డబుల్‌ ఇంజిన్‌ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి గూండాలు ధ్వంసం చేసిన డివైఎఫ్‌ఐ త్రిపుర రాష్ట్ర కార్యదర్శి నబరున్‌ దేవ్‌ నివాసాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఆయనతో పాటు పొలిట్‌బ్యూరో సభ్యులు, త్రిపుర రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి, ఇతర సీనియర్‌ నేతలు కూడా ఉన్నారు. నబరున్‌ దేవ్‌, ఆయన కుటుంబ సభ్యులతో పార్టీ నేతలు మాట్లాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నబరున్‌ దేవ్‌ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బిజెపి గూండాలు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అదే రోజున సెపాహిజాలా జిల్లాలోని కలంచౌరాలో, సిపిఐ(ఎం) మద్దతుదారులపై దాడి జరగడమే కాకుండా, వారు జాతీయ జెండాను ఎగురవేయకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనపై సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సేవా కార్యక్రమాలను అడ్డుకోవడం, బెదిరింపులకు పాల్పడటం ప్రజాస్వామ్య వాతావరణానికి విరుద్ధమని మండిపడ్డారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో, త్రిపురలో అధికారంలో ఉన్న డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు ఈ ఘటన నిదర్శనమని అన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదం, ప్రజల భద్రతను దెబ్బతీస్తోందని అన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేసేందుకు యత్నిస్తున్నారని అన్నారు. న్యాయవాది, మహిళా కార్యకర్త ఏర్పాటు చేసిన సిపిఐ(ఎం) పార్టీ కార్యాలయంపై బిజెపి గూండాలు దాడి చేసి, పూర్తిగా ధ్వంసం చేశారని మండిపడ్డారు. బిజెపి గూండాలు కేవలం పార్టీ కార్యాలయాలపై మాత్రమే కాకుండా కార్యకర్తలపై కూడా భౌతిక దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో సిసిటివి కెమెరాలను కూడా నాశనం చేశారని, అయితే ఫుటేజీ అందుబాటులో ఉందని అన్నారు. బుధవారం సాయంత్రం 7.40 గంటల సమయంలో సుమారు 20 నిమిషాల పాటు దాడి జరుగుతున్నా పోలీసులు ప్రేక్ష‍కుల్లా ఉండిపోయారని, ఎటువంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. ఈ ఘటన ఒక్కటే కాదని, సుమారు గడిచిన ఎనిమిదేళ్లలో ఇటువంటివి పదికి పైగా ఘటనలు జరిగాయని అన్నారు. కేసులు కూడా నమోదు చేశారని అన్నారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటని అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా మైనారిటీలు, ఎస్‌సి, ఎస్‌టిలు లక్ష్యంగా దాడులకు దిగుతోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలను 300 శాతం పెంచారని, కొంతమేర తగ్గించి, తగ్గించాం అంటూ బాకా ఊదుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజల జీవనోపాధిపై దెబ్బ కొడుతున్నారని, ధరలు గణనీయంగా పెరిగాయని, నిరుద్యోగం పెరిగిపోయిందని, చాలా మంది యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నాప్‌, అత్యాచారాలు పెరిగిపోయాయని, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్ష‍ీణించాయని అన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం క్రిమినల్స్‌లా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. క్రిమినల్‌ బుద్ధి కలిగిన రాజకీయ నేతలు అధికారంలో ఉన్నారని, ఈ రాజకీయ దిగజారుడు దోరణిని ఎదుర్కొనేందుకు ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్