న్యూఢిల్లీ : ఆర్థిక సమ్మిళితం లక్ష్యంగా కేంద్రం ప్రారంభించిన ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పిఎంజెడివై) ఖాతాల్లో భారీ సంఖ్యలో నిష్క్రియ ఖాతాలు ఉన్నట్లు ఆర్‌టీఐ సమాధానం వెల్లడించింది. పిఎంజెడివై కింద ఉన్న ప్రతి నాలుగు ఖాతాల్లో ఒకటి నిష్క్రియంగా ఉందని పేర్కొంది. సుమారు 5.72కోట్ల ఖాతాల్లో నిల్వ జీరోగానే ఉందని తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 12 నాటికి, దేశవ్యాప్తంగా 59 కోట్లకు పైగా పిఎంజెడివై ఖాతాలు ఉన్నాయని, వాటిలో మొత్తం రూ.3.15 లక్షల కోట్లకు పైగా నిల్వ ఉందని ఆర్థిక విభాగం వెల్లడించింది. ఆర్‌టిఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ దాఖలు చేసిన దరఖాస్తుకు సమాధానంగా, ఆర్థికమంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఈ వివరాలు వెల్లడించింది. మొత్తం ఖాతాల్లో 32.89కోట్ల ఖాతాలు మహిళలు, ట్రాన్స్‌జెండర్స్ పేరిట ఉండగా, 26.14కోట్ల ఖాతాలు పురుషుల పేరిట ఉన్నాయి. 5.72కోట్ల పిఎంజెడివై ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ ఉందని, అలాగే 15,36,77,009 ఖాతాలు నిష్క్రియ ఖాతాలుగా వర్గీకరించబడ్డాయని గణాంకాలు వెల్లడించాయి.
జీరో బ్యాలెన్స్ ఖాతాల సంఖ్యలో యుపి అగ్రస్థానం
జీరో బ్యాలెన్స్ ఖాతాల సంఖ్యలో ఉత్తరప్రదేశ్ 95.92 లక్షలతో అగ్రస్థానంలో ఉంది. బీహార్ 62.35 లక్షలు, పశ్చిమ బెంగాల్ 37.20 లక్షలు, అస్సాం 36.30 లక్షలు, మహారాష్ట్ర 36.04 లక్షల ఖాతాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నిష్క్రియ పిఎంజెడివై ఖాతాల సంఖ్యలోనూ ఉత్తరప్రదేశ్ ముందంజలో ఉంది. అక్కడ 3.23 కోట్ల ఖాతాలు నిష్క్రియంగా ఉన్నాయి. బీహార్‌లో 1.59 కోట్లు, మధ్యప్రదేశ్‌లో 1.35 కోట్లు, పశ్చిమ బెంగాల్‌లో 1.02 కోట్లు, మహారాష్ట్రలో 97.94 లక్షల ఖాతాలు నిష్క్రియంగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. మొత్తం పిఎంజెడివై ఖాతాల సంఖ్యలోనూ ఉత్తరప్రదేశ్ 10.51 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. బీహార్ 7.01 కోట్లు, పశ్చిమ బెంగాల్ 5.73 కోట్లు, రాజస్థాన్ 3.87 కోట్లు, మహారాష్ట్ర 3.85 కోట్ల ఖాతాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
జీరో బ్యాలెన్స్, నిష్క్రియ ఖాతాలకు సంబంధించిన జెండర్ (లింగ ఆధారిత) వివరాలను ప్రత్యేకంగా నిర్వహించడం లేదని సెప్టెంబర్ 1న ఇచ్చిన ఆర్‌టీఐ సమాధానంలో ఆర్థిక సేవల విభాగం తెలిపింది. అలాగే రూ.100 కంటే తక్కువ నిల్వ ఉన్న ఖాతాలు, గత ఐదేళ్లలో మూసివేసిన ఖాతాలు, అనుమానాస్పద లావాదేవీలు లేదా సైబర్ మోసాల కారణంగా బ్లాక్ లేదా ఫ్రీజ్ చేసిన ఖాతాలకు సంబంధించిన వివరాలు కూడా తమ వద్ద ప్రత్యేకంగా లేవని పేర్కొంది.
2014లో ప్రారంభమైన పిఎంజెడివై ఖాతాలు
ఆర్థిక సమ్మిళితం కోసం జాతీయ కార్యక్రమంగా ప్రధానమంత్రి జన్‌ధన్ యోజనను 2014 ఆగస్టులో కేంద్రం ప్రారంభించింది. ప్రతి కుటుంబానికి కనీసం ఒక ప్రాథమిక బ్యాంకు ఖాతాను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు బ్యాంకింగ్ సదుపాయాలు, ఆర్థిక అక్షరాస్యత, సామాజిక భద్రతా రక్షణ కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలుగా కేంద్రం పేర్కొంది. ఆర్‌టిఐ సమాధానంతో అందించిన రాష్ట్రాల వారీ గణాంకాలు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినవి.







కామెంట్‌లు (0)