బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు

18 జులై, 2026

fire
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 12:24 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- 9మంది మృతి, మరో ఆరుగురి పరిస్థితి విషమం

అహ్మదాబాద్‌ : బిజెపి పాలిత గుజరాత్‌‌లోని అనధికార బాణసంచా ఫ్యాక్టరీలో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఒక్కసారిగా ఈ విస్ఫోటనం సంభవించింది. కొన్ని కిలోమీటర్ల వరకు పేలుళ్ల శబ్దాలు వినిపించాయంటే పేలుడు తీవ్రత ఎంతలా వుందో అర్ధమవుతోంది. స్థానికంగా గల రమోల్‌ ఏరియాలోని ఈ ఫ్యాక్టరీలో పేలుడు జరిగిన సమయంలో 15మంది వున్నారని ప్రాధమిక వార్తలను బట్టి తెలుస్తోంది. పేలుడు జరిగిన వెంటనే అక్కడకు దగ్గరలోనే వున్న సత్వర కార్యాచరణ బలగాలు(ఆర్‌‌ఎఎఫ్‌), సిపిఆర్‌ఎఫ్‌ ‌బలగాలు చేరుకున్నాయి. ప్రమాద తీవ్రత అర్ధమైన వెంటనే అగ్నిమాపక యంత్రాలను కూడా అదనంగా రప్పించారు. మృతదేహాలను, తీవ్రంగా గాయపడిన వారిని అంబులెన్సుల్లో రెండు ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు పిల్లలు వున్నారని, వారి పరిస్థితి విషమంగానే వుందని డాక్టర్‌ ‌లీనా దాభి తెలిపారు. మరో వ్యక్తి పరిస్థితి కూడా ప్రమాదకరంగానే వుంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెక్టార్‌-2 అదనపు పోలీసు కమిషనర్‌ ‌జయ్‌‌పాల్‌ ‌సింగ్‌ ‌రాథోడ్‌ ‌మాట్లాడుతూ అహ్మదాబాద్‌ ‌నగరంలోని తూర్పు ప్రాంతంలో రమోల్‌ ఏరియాలో ఈ పేలుడు చోటు చేసుకుందని చెప్పారు. మెహుల్‌ ‌దోడియా అక్రమంగా కాలవకు సమీపంలో ఆరుబయట బాణాసంచా ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నాడని చెప్పారు. ఫ్యాక్టరీ లైసెన్స్‌‌ను రద్దు చేసినప్పటికీ పొలంలోనే ఈ ఫ్యాక్టరీ నడుపుతున్నాడన్నారు. ప్రస్తుతం మంటలను ఆర్పేశామని, పరిస్థితిని అదుపులోకి తెచ్చామని తెలిపారు. రమోల్‌ ‌పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతారని తెలిపారు. అహ్మదాబాద్‌ మేయర్‌ ‌హితేష్‌ ‌బారట్‌సహా పలువురు అధికారులు అక్కడకు చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. ప్రధాని నరేంద్ర మోడీ, గుజరాత్‌ ‌ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ ప్రమాదంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఎక్స్‌‌లో ‌ప్రధాని, సిఎం పోస్టు పెట్టారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని సహాయ నిధి నుండి రూ.2లక్షలు, సిఎం సహాయ నిధి నుంచి రూ.4 లక్షలు, గాయపడిన వారికి చెరో రూ.50వేలు ఎక్స్‌‌గ్రేషియా అందజేయనున్నట్లు ప్రకటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్