భోపాల్ సరిహద్దులో భైఠాయింపు
కనీస మద్దతు ధర కోసం డిమాండ్
భోపాల్: మధ్యప్రదేశ్‌లో రైతులు కనీస మద్దతు ధర కోసం రోడ్డెక్కారు. సమస్యల పరిష్కారం కోసం సంయుక్త కిసాన్ మోర్చా ( ఎస్‌కెఎం)తో పాటు పలు రైతు సంఘాలు భోపాల్ మార్చ్ కార్యక్రమాన్ని చేపట్టాయి. అయితే భోపాల్ సరిహద్దు ప్రాంతమైన హోషంగాబాద్ రోడ్డులో మంగళవానం పోలీసులు బారికేడ్‌లు అడ్డుపెట్టి రైతులు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆగ్రహించిన అన్నదాతలు అక్కడే భైఠాయించారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకూ కదిలేది లేదని తేల్చి చెప్పారు. బిజెపి ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అంతేకాకుండా భోపాల్ కలెక్టర్ ప్రియాంక్ మిశ్రా ఆ ప్రాంతం వెంబడి ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. పోలీసులు తీరును రైతులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మార్చ్ చేస్తామని రైతు సంఘాల నాయకులు ప్రకటించారు. అయితే, రైతులు కొన్ని రోజులకు సరిపడా పప్పులు, వంట సామగ్రి, ఆహారాన్ని తమతో పాటు తెచ్చుకున్నారు. రోడ్డుపైనే వంట చేసుకుని అక్కడే తమ నిరసనను తెలుపుతున్నారు. దీనిపై బిజెపి ప్రభుత్వం ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకూ స్పందించకపోవడం గమనార్హం. ఢిల్లీ సరిహద్ధుల్లో రైతుల ఆందోళనలు గుర్తుకు తెచ్చేలా మధ్యప్రదేశ్ రైతులు పోరాడుతున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు.
రైతుల డిమాండ్స్...
మూంగ్ (పెసలు) పంటను 100 శాతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. అలాగే ఎరువుల పంపిణీకి ఉపయోగించే ఇ-టోకెన్ వ్యవస్థను రద్దు చేయాలని, ఎరువులను తగినంతగా అందుబాటులో ఉంచాలని కూడా వారు ప్రభుత్వాన్నికోరారు. తమ ఉత్పత్తులకు మద్దతు ధరలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో పెసలు ఉత్పత్తి పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పంట దిగుబడి సుమారు 20.16 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని అంచనా. భారీ ఉత్పత్తి ఉన్నప్పటికీ, కేంద్రం ధరల మద్దతు పథకం కింద కేవలం 4.54 లక్షల మెట్రిక్ టన్నుల పంటను మాత్రమే కొనుగోలు చేయడానికి అంగీకరించింది. దీంతో భారీ మొత్తంలో పంట కొనుగోలు కాకుండా పోయింది. అలాగే సకాలంలో ఎరువులు అందటం లేదని, ధరలు అధికంగా ఉన్నాయని రైతులు తెలిపారు. అయితే బిజెపి ప్రభుత్వం.. రైతుల సమస్యలను పరిష్కరించకుండా అణచివేయడానికి ప్రయత్నిస్తుందని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.







కామెంట్‌లు (0)