ఇద్దరు మృతి, యజమాని అరెస్టు
నొయిడా : నొయిడాలోని పలు అంతస్తుల భవంతిలో బుధవారం చెలరేగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మరణించారని పోలీసులు తెలిపారు. ఆ భవనంలో నివసిస్తున్న మరో 50మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు చెప్పారు. సెక్టార్ 66లోని మమురా గ్రామంలోని ఈ భవంతిలో మంటలను కూడా పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారని అధికారులు తెలిపారు. మరణించిన వారిలో ఒక పురుషుడు, మహిళ వున్నారని, వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్ళేసరికే వారు చనిపోయారని పోలీసులు తెలిపారు. గ్రౌండ్ ప్లస్ ఫోర్ భవనంలో ఒక్కో ఫ్లోర్‌కు 10నుండి 12వరకు గదులు వున్నాయని, వీటిని రెసిడెన్షియల్ ఫ్లాట్‌లుగా ఉపయోగిస్తున్నారని పోలీసు జాయింట్ కమిషనర్ రాజీవ్ మిశ్రా తెలిపారు. ఇందుకు సంబంధించి భవన యజమానిని అరెస్టు చేసినట్లు చెప్పారు. భవనాన్ని లీజుకు తీసుకున్న ఆ యజమానిపై ఎఫ్‌ఐఆర్‌ను కూడా నమోదు చేశారు. భవనంలో ఎలక్ట్రిక్ ద్వి చక్ర వాహనానికి చార్జింగ్ పెట్టగా షార్ట్ సర్క్యట్ అయి మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ఆ ఆవరణలోనే పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు కూడా పార్కింగ్‌లో వున్నాయని, వాటికి కూడా మంటలు వ్యాపించాయని మిశ్రా తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఏడు అగ్ని మాపక యంత్రాలు, హైడ్రాలిక్ ప్లాట్‌ఫారం వచ్చాయని, చాలామందిని కాపాడినట్లు మిశ్రా చెప్పారు. మరణించిన వారిద్దరు కూడా అప్పటికే అస్వస్థతతో బాధపడుతున్నారని, వారు పొగను పీల్చడంతో పడిపోయారని, వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్ళినా ఫలితం లేకపోయిందని మిశ్రా విలేకర్లకు చెప్పారు.







కామెంట్‌లు (0)