సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

భవనాలపై దుబారా వ్యయాన్ని తగ్గించి, పాఠశాలలను బాగు చేయండి : సిజెపి

1 గంట క్రితం

CJP
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 05:57 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : భవనాలపై దుబారా వ్యయాన్ని తగ్గించి, పాఠశాలల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని 'కాక్రోచ్ జనతా పార్టీ' (సిజెపి) ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర మంత్రుల అధికారిక నివాసాల నిర్వహణ కోసం గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 92.35 కోట్లు ఖర్చు చేశారని, ఆ నిధులతో 10 కొత్త ప్రభుత్వ పాఠశాలలను నిర్మించి ఉండవచ్చని 'కాక్రోచ్ జనతా పార్టీ' (సిజెపి) పేర్కొంది. కేంద్రం తప్పుడు ప్రాధాన్యతలకు పెద్దపీట వేస్తోందని మండిపడింది. డబ్బు అందుబాటులో ఉందని, కానీ పాఠశాలల విషయంలో కేంద్రానికి చిత్తశుద్ధి లేదని ఉద్దేశ్యం మాత్రం లేదని ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. మంత్రులు నివసిస్తున్న వలసవాద కాలం నాటి బంగళాలపై పెరుగుతున్న ఖర్చు గురించి వచ్చిన నివేదికపై సిజెపి కన్వీనర్‌ అభిజీత్‌ దీప్కే స్పందిస్తూ.. "మీ విలాసవంతమైన ఇళ్లను బాగుచేయించడం ఆపి, పాఠశాలలను బాగుచేయండి!" అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఢిల్లీలో కేంద్రమంత్రుల అధికారిక భవనాల ఆధునీకరణ, ఫర్నిచర్‌, మరమ్మత్తుల కోసం 2014-15లో 27.47 కోట్లు ఖర్చు చేయగా, 2025-26 నాటికి 92.35 కోట్లకు పెరిగిందని ఆర్‌టిఐ సమాధానమిచ్చింది. ఈ భవనాల ఆధునీకరణ, మరమ్మత్తుల కోసం 2014-15నుండి 2025-26 వరకు సుమారు 12 ఏళ్లపాటు మొత్తంగా రూ547.68 కోట్లు ఖర్చు చేసినట్లు సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (సిపిడబ్ల్యుడి) సమాధానమిచ్చింది. ఇటీవల ఈ ఖర్చు గణనీయంగా పెరిగింది. 2014-15, 2018-19 మధ్య ఏడాదికి సగటున రూ.26.78 కోట్లు ఖర్చు చేయగా, 2019-20, 2023-24 మధ్య రెట్టింపై రూ.50 కోట్లకు చేరుకుంది. అలాగే 2024-25లో రూ.71.98 కోట్లకు పెరగగా, గతేడాది 92.35 కోట్లకు చేరింది.


ఈ ఖర్చుల అంశాన్ని ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ నివసిస్తున్న అధికారిక నివాసం నిర్మాణం, పునరుద్ధరణపై చెలరేగిన వివాదంతో పోల్చుతూ, ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సోమనాథ్ భారతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌ నివాస నిర్మాణం విషయంలో ఆప్‌ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏ అవకాశాన్నీ వదలని 'గోడీ మీడియా' (అనుకూల మీడియా), మోడీ ప్రభుత్వంలోని మంత్రుల ఇళ్ల మరమ్మతుల కోసం జరిగిన ఈ 92 కోట్ల భారీ ఖర్చుపై ఎందుకు చర్చించడం లేదని కేంద్రాన్ని నిలదీశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్