ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎవరు ఓటువేయాలో మీరెలా నిర్ణయిస్తారు..?

1 గంట క్రితం

WhatsApp Image 2026-10-03 at 10.09.40 PM.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 07:40 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ముమ్మాటికీ ఇది మోడీ, అమిత్‌‌షాల కుట్రే

  • సిఇసి జ్ఞానేష్‌ కుమార్ రాజీనామా చేయాలి

  • మీడియాతో ముఖాముఖిలో సినీనటుడు ప్రకాశ్‌‌రాజ్‌

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ డిమాండ్ చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌ కుమార్ తన పదవికి తక్షణం రాజీనామా చేయాలని కోరారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన మీడియా ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ఏటా ఓటర్ల జాబితా పరిశీలన జరుగుతున్నప్పుడు ప్రత్యేకంగా ‘సర్‌’ ప్రక్రియను ఎందుకు చేపట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. బతికున్న వ్యక్తులు కూడా తమ ఓటు హక్కును మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు. ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఉపాధి కోసం వెళ్లినంత మాత్రాన వారి ఓట్లను తొలగించడం సరికాదన్నారు. అక్రమ చొరబాటుదారులు ఉన్నారని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఇన్నేళ్లుగా ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ ఏం చేసిందో స్పష్టం చేయాలన్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఓటర్లను మారిస్తే మొత్తం ఓటర్ల సంఖ్య తగ్గకూడదనీ, కానీ 13 కోట్ల ఓట్లు ఎలా తొలగించబడ్డాయని అడిగారు. మరణించినవారు, విదేశాలకు వెళ్లిన వారి ఓట్లు తొలగిస్తే తమకు అభ్యంతరం లేదనీ, ఆపేరు చెప్పి బతికున్నవారు, ప్రశ్నించేవారి ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు. ‘సర్‌’ ప్రక్రియలో దళితులు, ముస్లింలు, ఆదివాసీలు, పేదలు, మహిళలు ప్రభావితమవుతున్నారనీ, వారి ఓట్లను లక్ష్యంగా చేసుకొని తొలగిస్తున్నారని తెలిపారు. ఓటుహక్కును కొందరికే పరిమితం చేసే కుట్రకు పాల్పడింది ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌‌షానే అని, వారు చెప్పినట్టే జ్ఞానేష్‌కుమార్‌ ‌చేస్తున్నారని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘంలో ముగ్గురు కమిషనర్లు ఉంటే, ఇద్దరు ఒకే వాదనకు కట్టుబడి ఉంటే, దాన్ని కాదని జ్ఞానేష్‌కుమార్‌ ఓట్ల తొలగింపు, ఫారం-6లో మార్పులు ఏకపక్షంగా ఎలా చేస్తారని ప్రశ్నించారు. కర్ణాటకలోని 23 జిల్లాల్లో 100 పోలింగ్ బూత్‌లను పరిశీలించాననీ, అక్కడ పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించినట్లు గుర్తించామని తెలిపారు. తక్షణం దేశవ్యాప్తంగా తొలగించిన13 కోట్ల ఓట్లను పునరుద్ధరించి, పాత ఓటర్ల జాబితాను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం 2023 నుంచి తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లన్నింటినీ సుప్రీంకోర్టు తెప్పించుకుని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం వ్యవస్థకు సంబంధించి 2023లో చేసిన చట్టపరమైన మార్పులను కూడా పునఃపరిశీలించాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు కల్పించిన న్యాయపరమైన రక్షణను తొలగించాలని డిమాండ్‌ ‌చేశారు. “ప్రజలు ఎవరు అధికారంలో ఉండాలో నిర్ణయించాలా? లేక ఎవరు ఓటు వేయాలో మీరు నిర్ణయిస్తారా?” అని నిలదీశారు. ఓటు హక్కును కాపాడుకోవడం కోసం ప్రజలు ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందని, శాంతియుత ప్రజా ఉద్యమాలు అవసరమని అభిప్రాయపడ్డారు.

ఆయన మాట్లాడుతున్న సమయంలో బిజెపి కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ‘గోబ్యాక్‌’ అని నినాదాలు చేశారు. అక్కడి వారెవ్వరూ పట్టించుకోకపోవడంతో జారుకున్నారు. ఈ ఘటనపై ప్రకాశ్‌‌రాజ్‌ ‌స్పందించారు. తనకు నాలుగు ఓట్లు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని సవాలు విసిరారు. తాను కోర్టులోనే సమాధానం చెప్పానని, ఇప్పుడు ఆ తప్పుడు పిటీషన్‌ ‌వేసిన వ్యక్తి కోసం న్యాయస్థానం వెతుకుతున్నదని వివరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్