ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకుతూహలం

1 గంట క్రితం

Gemini_Generated_Image_fhtq8hfhtq8hfhtq.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 08:26 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

అరవింద్ ఏడవ తరగతి కుర్రాడు. ఉదయం ఆరు గంటలకు నిద్ర లేచాక మొబైల్ ఫోన్ పట్టుకుని రీల్స్ చూస్తూ ఉంటాడు. పాఠశాలకు వెళ్లాక కూడా వాడి మనసంతా టిక్‌టాక్, ఫ్రీ ఫైర్ లాంటి ఆటల మీదే ఉండేది.

ఒకరోజు బడిలో ‘ఇవాళ మనం క్లోరోఫిల్ గురించి తెలుసుకుందాం!’ అని సైన్స్ ఉపాధ్యాయుడు చెప్పారు.

అది విన్న అరవింద్ లోలోపల నవ్వుకున్నాడు . ‘ఇలాంటి పాత విషయాలు తప్ప మరేమైనా తరగతి పుస్తకాల్లో ఉంటాయా? వీటివల్ల ఉపయోగమేమైనా ఉందా? నా స్నేహితులంతా ఆన్‌లైన్‌లో ఉండి ఉంటారు. ప్రపంచమంతా పరిగెడుతోంది. నేను మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నాను’ అనుకున్నాడు.

అరవింద్ ఫ్రెండ్ సుమ కూడా వాళ్ల పక్క ఇంట్లోనే ఉంటుంది. ఆమె కూడా వాడిలాగానే ఆలోచించేది. సుమ కూడా తెలివైనదే అయినా స్మార్ట్ ఫోను మోజులో పడిపోయింది. ఎప్పుడు చూసినా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఫ్యాషన్ ట్రెండ్స్ చూస్తూ సమయం గడుపుతుంది. ‘పాఠాలు ఎప్పుడూ ఉండేవే. అదొక పెద్ద తలనెప్పి వ్యవహారం. మజా అంతా ఇన్‌స్టాలోనే ఉంది కదా! అది తెలియక తరగతి పిల్లలంతా మాష్టారు చెప్పిన వాటికి గంగిరెద్దులా తలూపుతున్నారు’ అనుకునేది.

అరవింద్, సుమ కలిసి టైమ్ పాస్ చేస్తూ, ‘నేర్చుకోవడం అంటే ఏంటి? తరగతి పుస్తకంలో రాసింది చదివి పరీక్ష రాయడమేనా?’ అని అనుకుంటారు.

ఒక శుక్రవారం సాయంత్రం పాఠశాల విడిచిన తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా దారిపక్కన మట్టిలో వాళ్ళకొక పాత డైరీ కనిపించింది. ‘అందులో ఏం రాసి ఉంటుందో చూద్దామా?’ అని అడిగింది సుమ.

అరవింద్ దానిని చేతితో అందుకుని మెల్లగా తెరిచి చూశాడు. ఆ పాత డైరీలో కొన్ని పేజీల్లో ఏవేవో విషయాలు రాసి ఉన్నాయి. చిన్న చిన్న గీతలు, ప్రశ్నలు, అంకెలు,

సమాధానాలు రూపంలో చాలానే రాసి ఉన్నాయి. ‘ఆకులు పచ్చగా ఎందుకు ఉంటాయి? పక్షులు ఎలా ఎగురుతాయి? ఈ రంగులు ఎలా వస్తాయి? నీ చుట్టూ ఉన్న

రహస్యాల్ని కనుక్కోవాలి!’ ఇలాంటి ప్రశ్నలు, దృక్పథాలు అర్థం కాని చేతిరాతతో కనిపించాయి.

అది చూడగానే ఇద్దరూ నవ్వుకున్నారు . ‘ఎవడో పాత కాలం మనిషి రాసిన డైరీ అయి ఉంటుందేమో!’ అని సుమ అంది.

అలా వాళ్లు చదువుతూ ఉంటే వాళ్లకి ఒకచోట ‘కుతూహలం లేకపోతే జీవితం వ్యర్థం. ఒక చిన్న ప్రశ్నే.. కొత్తది, పెద్దదైన ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది!’ అని కనబడింది. దాన్ని చదివారు ఇద్దరూ.

ఆ వాక్యాలు ఇద్దరి మనసుల్లో కొత్త ఆలోచనలు రేకెత్తించాయి. ఇంటికి వెళ్లాక, మొబైల్స్ పక్కన పెట్టేసి, డైరీలో రాసిన మొదటి ప్రశ్న ‘ఆకులు ఎందుకు పచ్చగా ఉంటాయి?’ అన్న విషయం తెలుసుకోవాలనుకున్నారు.

మొబైల్ తెరుచారు. గూగుల్‌లో వెతికారు. వాళ్ళకి క్లోరోఫిల్ గురించి తెలిసింది. ఇంటి పెరటిలో మొక్కలను తీసుకుని, ఆకుల్లో కాంతి పడగా ఎలా మారుతాయో ఇద్దరూ పరీక్ష చేశారు.

తరువాత రోజు ఆదివారం కావడంతో ఇద్దరూ కలిసి ఇంటి టెర్రస్‌ మీదకు వెళ్లారు. ఆ డైరీలో రాసి ఉన్న విషయం ‘పక్షులు ఎలా ఎగురుతాయి?’ అనే ప్రశ్నకు సమాధానం కోసం, ఎగురుతున్న పక్షులను గమనించారు. అలా గమనించే క్రమంలో సుమ ఒక చిన్న ప్రయోగం చేసింది. కాగితం విమానాలు చేసి, ఎలా ఎగురుతాయో పరీక్ష చేసింది.

అరవింద్ ‘అరె! ఇది ఎయిర్‌ ఫాయిల్ ప్రిన్సిపల్!’ అని అరిచాడు.

ఆ సాయంత్రం ఇద్దరూ లైబ్రరీకి వెళ్లి, కొన్ని పుస్తకాలు తెచ్చుకున్నారు. మొబైలుని వీడియోలు చూడటానికి కాకుండా, మొదటిసారి విజువల్ ఎయిడ్స్ కోసం మాత్రమే వినియోగించారు.

సోమవారం పాఠశాలలో క్లోరోఫిల్ అంశం మాష్టారు చెప్పినప్పుడు అరవింద్ మొదటిసారి చేయి పైకెత్తి జవాబు చెబుతానన్నాడు. సరేనని మాష్టారు అన్న తరువాత “క్లోరోఫిల్ సూర్యకాంతిని పీల్చుకుని ఆకుల్ని పచ్చగా చేస్తుంది. మేము ఇంట్లో పరీక్ష చేశాం!’ అన్నాడు.

సుమ కూడా తాను తెలుసుకున్న కొత్త సంగతి చెబుతానని చేయి ఎత్తింది. మాష్టారు చెప్పమని సంజ్ఞ చెయ్యగానే ‘పక్షులు ఎగరటానికి రెక్కల ఆకారం కీలకం’ అని వివరించింది.

తరగతి మొత్తం ఆశ్చర్యపోయింది.

మిగతా స్నేహితులు ‘మీకు ఏమి జరిగింది? మొబైల్స్ మీద పడి రీల్స్ మాత్రం చూసే మీరు క్లాసు వినడం ఎప్పుడు

మొదలు పెట్టారు?’ అని జోక్ చేశారు.

అరవింద్, సుమ నవ్వుతూ ‘మొబైల్ మా సాధనంగా మారింది. కుతూహలం మా ఆట అయింది!’ అన్నారు.

కొన్ని వారాల తర్వాత, ఇద్దరూ ఒక సైన్స్ క్లబ్ మొదలుపెట్టారు. వాళ్లకి దొరికిన పాత డైరీ వారందరికీ ‘కుతూహల పందిరి’ అయింది. ప్రతిరోజూ కొత్త ప్రశ్నలు రాసుకుంటూ, ప్రయోగాలు చేస్తూ, ఫ్రెండ్స్‌ను కూడా చేర్చుకున్నారు.

అరవింద్ ఒకసారి డైరీలో రాశాడు. ‘కుతూహలం లేకపోతే జీవితం వ్యర్థం. ఒక చిన్న ప్రశ్నే పెద్ద ప్రపంచాన్ని తెరుస్తుంది!’ .

ఇవి ఆ పాత డైరీలో రాసిన మాటలే. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి నోటి వెంట తరచూ వచ్చే మాటలయ్యాయి.


నారంశెట్టి ఉమామహేశ్వరరావు

9490799203

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్