ఆదివారం, 19 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రెండో పెళ్లి చేసుకుంటే..ఉద్యోగం ఊస్ట్ !

10 జులై, 2026

second ma
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 12:03 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- అస్సాంలో కొత్త నిబంధనలు

గౌహతి : మైనార్టీలను, గిరిజన తెగలను లక్ష్యంగా చేసుకొని అస్సాంలోని బిజెపి ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బహుభార్యత్వం పాటించేవారిపైనా అనేక కఠిన చర్యలను ప్రకటించింది. అస్సాంలోనూ, దేశంలోని అనేక ప్రాంతాల్లో కొన్ని గిరిజన తెగలు, మైనార్టీల విషయంలో బహుభార్యత్వం సాంప్రదాయంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే మహిళా సాధికారిత పేరుతో ఇప్పుడు ఆ గిరిజన తెగలను, మైనార్టీలను బిజెపి సర్కార్‌ ‌లక్ష్యంగా చేసుకుంది. ఒకరిని మించి పెళ్లాడితే ప్రభుత్వ పథకాలు ఏవీ ఆ కుటుంబాలకు వర్తించవని షరతులు విధించింది. ఒక వేళ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటే ఏ స్థాయిలో ఉన్నా..ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రకటించించింది. శుక్రవారం ప్రవేశపెట్టిన 2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది.

అస్సాం ఆర్థిక మంత్రి జయంత మల్లా బారువా శుక్రవారం శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బహుభార్యత్వం పాటిస్తున్న ఏ పురుషుడైనా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలకు అనర్హుడవుతారని ఆయన సభకు వెల్లడించారు. మహిళా సాధికారత, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. దీనికోసం 'అసోం సర్వీసెస్ (డిసిప్లిన్ అండ్ అప్పీల్) రూల్స్-1964'కు సవరణలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సైతం ఒక మీడియా సమావేశంలో ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. బహుభార్యత్వాన్ని అరికట్టేందుకు అస్సాం ప్రభుత్వం గత కొంతకాలంగా కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా 2025 నవంబర్‌లోనే "అసోం బహుభార్యత్వ నిషేధ బిల్లు, 2025"ను అసెంబ్లీలో ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం, మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో వివాహం చేసుకోవడం నేరం. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అయితే, కొన్ని షెడ్యూల్డ్ తెగలకు, ఆరో షెడ్యూల్ ప్రాంతాలకు ఈ చట్టం నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో సదరు తెగలకు చెందిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొక తప్పదనే విమర్శలు వినిపిస్తున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్