సోమవారం, 20 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

చందాల చోరీపై స్వతంత్ర విచారణ

18 గంటల క్రితం

kharge
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 11:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ప్రధానికి రాహుల్, ఖర్గే లేఖ

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో ‘చందాల చోరీ’ పై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని పార్లమెంట్ ఉభయ సభల ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీకి ఉమ్మడి లేఖ రాశారు. వేలాది మంది భక్తులు... ఎంతో నమ్మకంతో తమ కష్టార్జితాన్ని రామమందిరం కోసం విరాళాలుగా ఇచ్చారన్నారు. అలాంటి వారి నమ్మకానికి విరాళాల దొంగతనంతో ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని పార్లమెంట్‌లో ప్రకటించినప్పటికీ... ట్రస్ట్ లోని సభ్యులందరినీ కేంద్ర ప్రభుత్వమే నియమించిందని గుర్తు చేశారు. ‘ఈ ట్రస్ట్ లోని సభ్యులకు ఆర్ఎస్ఎస్, విహెచ్‌‌పిలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ఆరోపణలు ఎదుర్కొని పదవి కోల్పోయిన ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రధానికి అత్యంత సన్నిహితుడు’ అని లేఖలో ప్రస్తావించారు. ఇంత పెద్ద కుంభకోణం జరుగుతున్నా.. ప్రధాని మౌనంగా ఉండటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జవాబుదారీతనం వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. ‘ట్రస్ట్‌కు భక్తులు కానుకలుగా సమర్పించిన నగదు, బంగారం, వెండి తదితర ఆర్థిక వ్యవహారాలన్నింటిపై వెంటనే స్వతంత్ర, సమగ్ర విచారణకు ఆదేశించాలి. భక్తుల సొమ్మును ఎలా వినియోగించారో ప్రతి ఒక్కరికీ తెలిసేలా విచారణ నివేదికలను, ట్రస్ట్ ఖాతాలను వెంటనే బహిరంగపర్చాలి. సమాజంలో ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నవారైనా, ఎంతటి ప్రభావం ఉన్నవారైనా సరే.. ఈ అవినీతికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాల్సిందే’ అని డిమాండ్ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్