నగోయా : ఒకవైపు ఆసియా క్రీడల్లో మహిళా హాకీ బృందం చైనాపై చారిత్రాత్మక గెలుపు సాధించగా.. మరోవైపు అదే వేదికపై హాకీ అంపైర్ల మేనేజర్ గురీందర్ సింగ్ సంఘా దేశం పరువు తీసేలా వ్యవహరించారు. దురుసు ప్రవర్తన, వేధింపులకు సంబంధించి ఫిర్యాదులు రావడంతో ఆయనను ఈవెంట్ నుండి వెనక్కు పంపినట్లు సమాచారం. ఈ అంశానికి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. అయితే ఆసియా క్రీడల్లో విధులు నిర్వహిస్తున్న అంపైర్లలో ఒకరు సంఘాపై ఫిర్యాదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అధికారులు బస చేసిన హోటల్ నుండి కూడా మరో ఫిర్యాదు వచ్చినట్లు సమాచారం. అసభ్యకరమైన వీడియోలు చూపించడం, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడం వంటి అరోపణలు రావడంతో టోర్నమెంట్ నిర్వాహకులు చర్యలు తీసుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఇక్కడ బసచేసిన విదేశీ అధికారులను వేధించినట్లు పలు ఆరోపణలు వచ్చాయని, దీంతో ఆయనను భారత్‌కు పంపినట్లు సీనియర్ అధికారులు స్పష్టం చేశారు.
సంఘాపై ఫిర్యాదులు రావడం ఇదే మొదటిసారి కాదు. జలంధర్‌లో ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్‌గా విధులు నిర్వహించిన సమయంలోనూ ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గతేడాది హాకీ ఇండియా లీగ్‌లో ఒక మహిళా అంపైర్ సంఘా ప్రవర్తన, శారీరక వేధింపులపై యాజమాన్యానికి అధికారికంగా ఫిర్యాదు చేసింది. సెక్రటరీ జనరల్ భోలానాథ్ సింగ్ ఆదేశాల మేరకు హాకీ ఇండియా ముగ్గురు సభ్యుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే ఆ విషయాన్ని వెలుగులోకి రానీయలేదు. అయితే భోలానాథ్‌పై ఫిర్యాదు చేసిన వారిలో ఒకరైన అసుంటా లక్రా, సంఘాపై విచారణ కమిటీలో సభ్యురాలిగా ఉండటం గమనార్హం. గతంలో ఆయనపై ఫిర్యాదు వచ్చిందని, ఆ సమయంలో సంఘాను హెచ్‌ఐఎల్ నుండి తొలగించారని అసుంటా స్పష్టం చేశారు. గతంలో జరిగిన ఉదంతం దృష్ట్యా ఆయనను ఆ ప్రతిష్టాత్మకమైన క్రీడలకు పంపకుండా ఉండాల్సిందని అన్నారు.








కామెంట్‌లు (0)