- రాష్ట్రపతికి, విద్యా మంత్రికి బ్రిట్టాస్ లేఖ
న్యూఢిల్లీ : జెఎన్‌యు విద్యార్ధులు కొనసాగిస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పరిష్కరించేందుకు అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని కోరుతూ సిపిఎం పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభలో పార్టీ పక్ష నేత జాన్ బ్రిట్టాస్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. గత 17 రోజులుగా జెఎన్‌యు విద్యార్ధులు నిరసన తెలుపుతున్నారు.
విద్యార్ధులు బహిష్కరణ రద్దు చేయాలి.
జెఎన్‌యు చట్టం, 1966 కింద జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ విజటర్‌గా రాష్ట్రపతి పాత్రను ప్రస్తావిస్తూ, ఎన్నికైన జెఎన్‌యుఎస్‌యు ప్రతినిధులపై జారీ చేసిన బహిష్కరణ ఉత్తర్వులను రద్దు చేసేలా చూసేందుకు, చీఫ్ ప్రొక్టార్ కార్యాలయం (సిపిఒ) నిబంధనావళిలో అభ్యంతరకరమైన నిబంధనలను ఉపసంహరించుకోవడానికి, విద్యార్ధుల అపరిష్కృత సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని బ్రిట్టాస్ తన లేఖలో కోరారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి కూడా ఆయన లేఖ రాశారు. సుదీర్ఘంగా కొనసాగుతున్న ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు, నిరశన చేస్తున్న విద్యార్ధుల ఆరోగ్యం క్షీణించకుండా చూసేందుకు అత్యవసరంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ విషయాలను జెఎన్‌యు పాలనా విభాగంతో చర్చించాలని, అర్ధవంతమైన చర్చలను, కేంపస్‌లో ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని పునరుద్ధరించేలా చూడాలని కోరారు.
సామాజిక న్యాయం, లౌకికవాదం, ప్రజాస్వామ్యబద్ధమైన జీవన విధానమన్నవి జెఎన్‌యు వ్యవస్థాపక సూత్రాల్లో వున్నాయని బ్రిట్టాస్ పేర్కొన్నారు. జెఎన్‌యు మాజీ విద్యార్ధిగా తన సొంత అనుభవాన్ని ఆధారంగా చేసుకుని మాట్లాడుతూ, విద్యార్ధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగలిగేలా పరిస్థితులు వుండాలన్నారు. నిరంకుశ నిర్ణయాలను ప్రశ్నించేలా, కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారనే భయం లేకుండా చట్టబద్ధమైన తమ ఇబ్బందులను నిర్భయంగా గొంతెత్తి నినదించేలా వుండాలన్నారు. నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్ధుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వారి సంక్షేమం కోసం తక్షణమే జోక్యం చేసుకోవాలని, వారి ప్రజాస్వామ్యబద్ధమైన హక్కులను పరిరక్షించాలని బ్రిట్టాస్ విజ్ఞప్తి చేశారు. తద్వారా ఏ సూత్రాలపై అయితే జెఎన్‌యు నెలకొల్పబడిందో ఆ ప్రజాస్వామ్యబద్ధమైన, వ్యవస్థాగతమైన సూత్రాలను కాపాడాలని కోరారు.








కామెంట్‌లు (0)