పంజాబ్ పోలీసుల దమనకాండను ఖండించిన సిపిఎం
ఖన్నా (పంజాబ్) : పెండింగ్ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని, సర్వీసులను క్రమబద్ధీకరించాలని, గ్రామీణ ఉపాధి రంగాన్ని కాపాడాలని కోరుతూ పంజాబ్‌లోని ఖన్నాలో బుధవారం ఆందోళన నిర్వహించిన ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ (మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం) ఉద్యోగులు, గ్రామీణ కార్మికులపై పంజాబ్ ప్రభుత్వం దమనకాండకు దిగింది. తొలుత బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. తరువాత లాఠీ చార్జి చేశారు. పోలీసుల దాడిలో మహిళలతో సహా పలువురు గాయపడ్డారు. ఖన్నాలో పంచాయితీ శాఖ మంత్రి తరుణ్‌ప్రీత్ సింగ్ సాంద్ నివాసం వద్దకు ప్రదర్శనగా వెళుతున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. 23 జిల్లాలు, దాదాపు 250 బ్లాకుల నుండి వచ్చిన కార్మికులు ప్రేమ్ భండారీ పార్క్ వద్ద ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే విధానాలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం, వారిని నిలువరించేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించింది. మంత్రి నివాసం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసింది.
ప్రజాస్వామ్య హక్కులపై దాడి : సిపిఎం
పోలీసుల దాడులను సిపిఎం పంజాబ్ శాఖ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్య హక్కులపై, కార్మికుల పోరాటాలపై జరిగిన దాడి అని విమర్శించింది. తమకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటి కోసం అడిగిన ఉద్యోగులు, కార్మికులపై ఇలా బలప్రయోగానికి దిగడం పాలకుల నిరంకుశ ధోరణిని ప్రతిబింబిస్తోందని విమర్శించింది. కార్మికులు, ఉద్యోగులకు సిపిఎం సంఘీభావం ప్రకటించింది. తక్షణమే పెండింగ్‌లోని వేతనాలు, ఇతర ప్రయోజనాలు విడుదల చేయాలని కోరింది. ఆందోళనకారులపై పెట్టిన కేసులను ఉపసంహరిచుకోవాలని కోరింది. వారి సమస్యలు పరిష్కరించుకోవడానికి కార్మిక సంఘాలతో అర్ధవంతమైన చర్చలు జరపాలని కోరింది.
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం
ప్రశాంతంగా ప్రదర్శన నిర్వహిస్తున్న వారిపై పోలీసుల దమనకాండను యూనియన్ నాయకులు ఖండించారు. పంజాబ్‌లో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల కింద దాదాపు రెండు దశాబ్దాలుగా ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారికి అనేక నెలలుగా వేతనాలు పెండింగ్‌లో వున్నాయని తెలిపారు. రెగ్యులర్ ఉపాధి లేకుండానే వారు తమ పనులు కొనసాగిస్తున్నారన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని యూనియన్ల నేతలు హెచ్చరించారు.







కామెంట్‌లు (0)