న్యూఢిల్లీ : నీట్ ప్రశ్నల కోసం లాతూ కోచింగ్ సెంటర్ యజమాని శివరాజ్ రఘునాథ్ మోటెంగార్ రూ.5లక్షలు చెల్లించినట్లు సిబిఐ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. మోటెంగార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సిబిఐ ఈ వివరాలను కోర్టుకు సమర్పించింది. కెమిస్ట్రీ ప్రశ్నల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ ప్యానెల్‌లో సభ్యుడైన పి.వి.కులకర్ణికి మోటెంగార్ రూ.5 లక్షలు ఇచ్చారని పేర్కొంది. కులకర్ణి కోచింగ్ తరగతులకు మోటెంగార్ కుమారుడు హాజరయ్యాడని, అక్కడే ప్రశ్నలను అందించాడని, ఈ ప్రశ్నలకు మోటెంగార్ తన చేతిరాతతో నోట్స్ తయారు చేసుకున్నారని తెలిపింది. మోటెంగార్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, ఆ ఫోన్‌లో కెమిస్ట్రీకి సంబంధించిన 132 చేతిరాత ప్రశ్నలు ఉన్న 36 చిత్రాలు గుర్తించామని వెల్లడించింది. ఆ ఫోన్‌లో ఉన్న 111 ప్రశ్నలు నీట్ యుజి పరీక్షల కోసం ఎన్‌టిఎ రూపొందించిన ‘మాస్టర్ క్వశ్చన్ సెట్స్’లో ప్రశ్నలతో సరిపోలినట్లు పేర్కొంది. నీట్ పరీక్షకు సుమారు 10 రోజుల ముందే ఆ చిత్రాలను తీసినట్లు మెటాడేటా విశ్లేషణలో తేలిందని కూడా వెల్లడించింది. సహ నిందితుడు మనోజ్ భగవాన్ రావు షిరురే అందించిన సమాచారంతో లీకైన ప్రశ్నల కోసం చెల్లించిన నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
ఈ కేసులో సిబిఐ ఇప్పటివరకు మొత్తం 13మందిని అరెస్ట్ చేసింది. వీరంతా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. పేపర్ లీక్ కావడంతో మే3న నిర్వహించిన 'నీట్‌యుజి పరీక్షను NTA రద్దు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం జూన్ 21న తిరిగి పరీక్ష నిర్వహించింది.







కామెంట్‌లు (0)