- సిఐటియు ఆల్ ఇండియా కార్యదర్శి కెఎన్ ఉమేష్
కోజికోడ్ : ప్రజల డబ్బుతో, వారి నమ్మకంతో అభివృద్ధి అయిన ఎల్ఐసి సంస్థ.. కార్పొరేట్ శక్తుల పరం కాకుండా విశాల ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని, ఆ బాధ్యత ఎల్ఐసి ఏజెంట్ల పైనే ప్రధానంగా ఉన్నదని సిఐటియు ఆల్ ఇండియా కార్యదర్శి కెఎన్ ఉమేష్ తెలిపారు. ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి ఎఒఐ) 7వ అఖిలభారత మహాసభలు ఈ నెల 5, 6 తేదీల్లో కేరళం రాష్ట్రంలోని కోజికోడ్‌లో జరిగాయి. మహాసభలో కెఎన్ ఉమేష్ ముగింపు సందేశం ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్ శక్తులకు అప్పగించడమే పనిగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, గనులు, రోడ్లు వంటి అనేకం టాటా, అంబానీ, అదానీలకు కట్టబెట్టారని విమర్శించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే, ఎల్ఐసిలను కూడా ఇటువంటి కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసే కుట్రలు కేంద్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. దీనిలో భాగంగానే ఇన్సూరెన్స్ చట్టం 1938, ఎల్ఐసి చట్టం 1956, ఐఆర్‌డిఎఐ చట్టం 1999 వంటి చట్టాలను సవరణ చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టారని విమర్శించారు.
ఈ చట్టాల సవరణ ఫలితంగా ఇన్సూరెన్స్ కంపెనీలపై ఒక్క ఐఆర్‌డిఎఐ మాత్రమే కాకుండా ఆర్‌బిఐ, సెబి మొదలైన సంస్థల పెత్తనం పెరిగిపోతుందన్నారు. దీనివల్ల ఇప్పటికే ఎల్ఐసిలో షేర్లు అమ్మడం, పాలసీదారులకు ఇచ్చే బోనస్ రేట్లు తగ్గించడం, ఏజెంట్ల కమిషన్ తగ్గించడం వంటి నష్టాలు చోటుచేసుకున్నాయన్నారు. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ప్రజల సంపదతో నిర్మితమైన రూ.59 లక్షల కోట్ల విలువైన ఎల్ఐసి సంస్థ ప్రైవేటుపరం అవుతుందన్నారు. అలాకాకుండా చేసేందుకు ఎల్ఐసి ఏజెంట్లు, ఉద్యోగులు దేశంలోని అన్ని వర్గాల కార్మికులను, ప్రజలను కలుపుకొని విశాల ఉద్యమాన్ని నిర్మించాలని, అప్పుడే ఎల్ఐసిని కాపాడుకోగలమని అన్నారు.
అఖిలభారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సూర్జిత్ కుమార్ బోస్, పిజి దిలీప్
మహాసభ ముగింపు సందర్భంగా 27 మందిని ఆఫీస్ బేరర్లుగా, 117 మందిని సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా, 234 మందిని సెంట్రల్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకుంది. అఖిల భారత అధ్యక్షులుగా సూర్జిత్ కుమార్ బోస్, ప్రధాన కార్యదర్శిగా పిజి దిలీప్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎల్ మంజునాథ్‌ను ఎన్నుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్ ఇండియా ఆఫీస్ బేరర్లుగా పిఎల్ నరసింహారావు, జి రవి కిషోర్ ఎన్నికయ్యారు. ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ సభ్యులుగా రాష్ట్రం నుంచి టి కోటేశ్వరరావు, ఎం రాధ, బి వెంకట్రావు, సిహెచ్ నరసింహారావు, బి రమేష్ కుమార్, ఎస్ వీరభద్రరావు, ఎన్ఆర్ ఠాగూర్, ఎం నాగరాజు ఎన్నికయ్యారు.








కామెంట్‌లు (0)