ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మధ్యప్రదేశ్‌ కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు

1 రోజు క్రితం

hooch tragedy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 12:26 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

సాగర్‌ : మధ్యప్రదేశ్‌లో 16 మంది ప్రాణాలను బలిగొన్న కల్తీ మద్యం ఘటనలో ప్రధాన నిందితుల్లో ఒకరైన రవి లఖేరా (45)ను పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల అనంతరం అదుపులోకి తీసుకున్నారు. సాగర్‌ జిల్లా కేంద్రానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని బరైతా అటవీ ప్రాంతంలో పోలీసులు అతడిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో లఖేరా కాలికి బుల్లెట్‌ గాయమైందని పోలీసుసులు ఒక ప్రకటనలో తెలిపారు. అతనితో పాటు మోటార్‌సైకిల్‌పై ఉన్న మరో ఇద్దరు సహచరులు పరారయ్యారని అన్నారు. గాయపడిన లఖేరాను చికిత్స నిమిత్తం ఉత్తరప్రదేశ్‌లోని బందా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లైసెన్స్‌ కలిగిన మద్యం కాంట్రాక్టర్‌ మనీష్‌ లోధి అలియాస్‌ యశ్వంత్‌ సింగ్‌ లోధితో కలిసి లఖేరా కల్తీ మద్యం తయారు చేసి, సాగర్‌ జిల్లాలోని విక్రేతల ద్వారా సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

లఖేరాపై మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో సుమారు 25 క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. వీటిలో ఎక్కువ కేసులు ఎక్సైజ్‌ చట్టం కింద నమోదైనవేనని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లా అతడి స్వస్థలం కాగా, సాగర్‌ జిల్లాతో సరిహద్దు కలిగిన లలిత్‌పూర్‌లోని గంగాపురం కాలనీలో అతడు నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 2025లో సాగర్‌లోని బహేరియా పోలీస్‌ స్టేషన్‌లో అక్రమంగా మద్యం తయారు చేస్తున్నారనే ఆరోపణలపై నమోదైన కేసులోనూ లఖేరా కోసం పోలీసులు గాలిస్తున్నారు. మద్యం తయారీతో పాటు దానికి అవసరమైన ముడిసరుకును సమకూర్చేవాడని, కల్తీ మద్యం తయారీ ముఠాకి నేతృత్వం వహించేవాడని ఆ వర్గాలు వెల్లడించాయి.

కల్తీ మద్యం సేవించడం వల్ల ఇప్పటివరకు 16 మంది మృతి చెందగా, మరో 32 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో నిందితులుగా గుర్తించిన 30 మందిలో 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా లఖేరాను అదుపులోకి తీసుకోవడంతో అరెస్టైన వారి సంఖ్య 17కు చేరింది.

మద్యం మాఫియాను ప్రభుత్వం కాపాడుతోందని సిపిఐ(ఎం) మండిపడింది. లలిత్‌పూర్‌ నుంచే కల్తీ మద్యం సరఫరా అయిందంటూ సాగర్‌ జిల్లా ఎస్పీ గతంలో చేసిన ప్రకటనపైనా అనుమానాలు వ్యక్తం చేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్