శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బరితెగించిన మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేకత

1 గంట క్రితం

labour
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 11:07 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- కనీస వేతన సంఘం నుంచి ప్రముఖ కార్మిక సంఘాల తొలగింపుపై సిఐటియు ఆగ్రహం

న్యూఢిల్లీ : కనీన వేతన సలహా సంఘం నుంచి ప్రముఖ కార్మిక సంఘాలను తొలగించడంపై సిఐటియు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యతో బరితెగించిన మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేకత బయటపడిందని విమర్శించింది. ఇప్పటికే విమర్శలు పాలైన మోడీ ప్రభుత్వ కార్మిక చట్టాలు మరింతగా క్రూరమైన కోరలు, పంజాలతో బయటకు వస్తున్నాయని పేర్కొంది. ఈ మేరకు సిఐటియు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం పునర్‌వ్యవస్థీకరించిన కేంద్ర కనీస వేతన సలహా సంఘాన్ని ఈ ఏడాది జూలై 21న మోడీ ప్రభుత్వం నోటిఫై చేసింది. అయితే చాలా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘంలో దేశంలోనే ప్రముఖ ట్రేడ్‌ ‌యూనియన్లు అయిన సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్‌‌టియుసిల ప్రాతినిధ్యాన్ని కక్షపూరితంగా నిరాకరించారు. ఈ నిరాకరణతో వేతనం సంఘం విశ్వసనీయతపైనే వేటు పడిందని సిఐటియు పేర్కొంది. కార్పొరేట్‌‌కు దాసోహమనే మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల నిర్వీర్యం తరువాత మరింత బరితెగించిన కార్మిక వ్యతిరేకత చర్యకు పాల్పడిందని విమర్శించింది. సులభ వాణిజ్యం పేరుతో వేతనాల తగ్గింపును సులభతరం చేయడానికి, చట్టబద్ధం చేయడానికే ఈ సంఘాన్ని పునర్‌వ్యవస్థీకరించిందని విమర్శించింది. ఇటువంటి కక్షపూరిత పక్షపాతాన్ని సిఐటియు ఖండించింది.

అయితే ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి ఇది ఊహించనిదేమీ కాదని, ఇప్పటికే కనీస వేతనాలపై అఖిల భారత కార్మిక సదస్సు ఏకగ్రీవంగా చేసిన త్రైపాక్షిక సిఫార్సును అమలు చేయడానికి అహంకారపూరితంగా మోడీ ప్రభుత్వం నిరాకరిస్తుందని సిఐటియు గుర్తు చేసింది. మోడీ ప్రభుత్వం తన కార్పొరేట్ దాస్య విధానాల ద్వారా దేశంలోని కార్మికుల వాస్తవ సగటు సంపాదన/ఆదాయ స్థాయి నిరంతరం దిగజారడంలో కీలక పాత్ర పోషిస్తోందని విమర్శించింది. ఇలాంటి విధ్వంసకర విధానాలను ఎదుర్కోవడానికి కార్మిక వర్గానికి ఏకం కావడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని సిఐటియు స్పష్టం చేసింది. కార్పొరేట్-మతతత్వ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త పోరాటానికి సిద్ధం కావాలని కార్మికులకు సిఐటియు పిలుపునిచ్చింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్