శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జిమ్‌ యజమాని దీపక్‌కుమార్‌పై బిజెపి ప్రభుత్వం కక్ష‍సాధింపు చర్యలు

1 రోజు క్రితం

Mohammad Deepak
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 01:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

డెహ్రాడూన్‌ : ముస్లిం దుకాణదారుడిని వేధిస్తున్న బజరంగ్‌ దళ్‌ సభ్యులను అడ్డుకున్న జిమ్‌ యజమాని దీపక్‌ కుమార్‌పై బిజెపి ప్రభుత్వం కక్ష‍సాధింపు చర్యలకు దిగింది. ఒక వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జిమ్‌ యజమాని దీపక్‌ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కోట్‌ద్వార్‌కు చెందిన వ్యాపారవేత్త సంజీవ్‌ టోంక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం సాయంత్రం ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తనను దూషించడంతో పాటు దాడి చేసి, చంపేస్తానని బెదిరించాడంటూ టోంక్‌ ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.


మొదట దీపక్‌ కుమార్‌పై బిఎన్‌ఎస్‌లోని సెక్షన్లు 351(2), 352 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిసిటివి దృశ్యాలు, ఫొటోలు, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం సెక్షన్లు 196, 115ను కూడా చేర్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఫిర్యాదుదారుడిని దూషించి, చంపేస్తానని బెదిరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్న కారణంతో ముందస్తు చర్యగా బిఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 170 కింద దీపక్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు. గుర్తించదగిన నేరం జరగకుండా నివారించేందుకు ఈ సెక్షన్‌ కింద చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. భద్రతా చర్యల్లో భాగంగా గురువారం సాయంత్రం కోట్‌ద్వార్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పోలీసులు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు.


ఈ ఏడాది జనవరిలో కోట్‌ద్వార్‌లో ఓ వృద్ధ ముస్లిం దుకాణదారుడు తన దుకాణం పేరులో 'బాబా' అనే పదాన్ని ఉపయోగించడాన్ని కొందరు బజరంగ్‌ దళ్‌ సభ్యులు వ్యతిరేకించారు. ఆ పేరు తొలగించాలని అతనిని బెదిరింపులకు దిగారు. ఈ సందర్భంగా దీపక్‌ కుమార్‌ జోక్యం చేసుకుని దుకాణదారుడికి మద్దతుగా నిలిచారు. నిరసనకారులతో వాగ్వాదం సందర్భంగా తనను 'మహ్మద్‌ దీపక్‌'గా పరిచయం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో వార్తల్లో నిలిచారు. అనంతరం ఆయన జిమ్‌కు వెళ్లకుండా బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా పలువురు మద్దతు ప్రకటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్