ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కేంద్ర ప్రభుత్వ విధానాలపై నవంబర్‌, డిసెంబర్‌లో దేశవ్యాప్త ఉద్యమం

8 గంటల క్రితం

nprd
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 11:59 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఎన్‌పిఆర్‌డి జాతీయ కమిటీ సమావేశంలో తీర్మానం

- 2016 ఆర్‌పిడి చట్టంలోని సెక్షన్‌ 74కు సవరణ చేయాలి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో దేశవ్యాప్త ప్రచార, ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి) పిలుపునిచ్చింది. ఢిల్లీలోని హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ భవన్‌లో ఎన్‌పిఆర్‌డి జాతీయ అధ్యక్షులు గిరీష్‌ కీర్తి అధ్యక్షతన జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. దేశవ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించి భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించారు. ఈ సందర్భంగా ఎన్‌పిఆర్‌డి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్‌ మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రత చట్టానికి సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వికలాంగుల ఆహార భద్రత హక్కును దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోరాటాల ఫలితంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది వికలాంగులకు అంత్యోదయ అన్నయోజన రేషన్‌ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. వికలాంగులందరికీ అంత్యోదయ రేషన్‌ కార్డులు దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కమిషనర్ల నియామకంపై చట్ట సవరణ చేయాలి

వికలాంగుల హక్కుల చట్టం-2016 అమలు, పర్యవేక్షణ కోసం జాతీయ స్థాయిలో చీఫ్‌ కమిషనర్‌, రాష్ట్ర స్థాయిలో స్టేట్‌ కమిషనర్లను నియమించాలని చట్టంలో ఉందని మురళీధరన్‌ తెలిపారు. మహిళా, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ కమిషన్లకు ఆయా వర్గాలకు చెందిన వారినే నియమించే నిబంధనలు ఉన్నప్పటికీ, వికలాంగుల కమిషనర్ల నియామకంలో ఇలాంటి నిబంధన లేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో నియమించే కమిషనర్లుగా వికలాంగులనే నియమించేలా సెక్షన్‌ 74ను సవరించాలని డిమాండ్‌ చేశారు.

రిజర్వేషన్లను నిర్వీర్యం చేసే కుట్రలు

వికలాంగులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్‌ సౌకర్యాన్ని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మురళీధరన్‌ విమర్శించారు. యుపిఎస్‌సి ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌లో 48వ ర్యాంకు సాధించిన అభ్యర్థికి సర్వీస్‌ కేటాయించకపోవడం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో దృష్టిలోపం ఉన్నవారికి పోస్టు రిజర్వేషన్‌ కేటాయించకపోవడం, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో మేధో వైకల్యం ఉన్న వ్యక్తికి ఉద్యోగం నిరాకరించడం వంటి ఘటనలు ఇందుకు ఉదాహరణలని పేర్కొన్నారు.

పెన్షన్‌ రూ.3 వేలకు పెంచాలి

వికలాంగులు వినియోగించుకునే విధంగా సామూహిక ప్రాంతాలను మార్చాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అమలులో ఎలాంటి పురోగతి లేదని మురళీధరన్‌ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులను గుర్తించి భర్తీ చేసేందుకు ప్రత్యేక నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 2014 నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వికలాంగుల హక్కుల అమలుకు తిలోదకాలు ఇస్తోందని, పోరాడి సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. 2012 నుంచి కేంద్ర ప్రభుత్వం వికలాంగుల పెన్షన్లకు రూ.300 మాత్రమే వాటాగా ఇస్తోందని, ఆ మొత్తాన్ని రూ.3 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు.

21 రకాల వైకల్యాల వివరాలు సేకరించాలి

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనాభా లెక్కల్లో 21 రకాల వైకల్యాల వివరాలను సేకరించాలని మురళీధరన్‌ డిమాండ్‌ ‌చేశారు. కేవలం తొమ్మిది రకాల వైకల్యాల వివరాలనే సేకరించాలని నిర్ణయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నంబు రాజన్‌, ఉపాధ్యక్షులు ఎం. అడివయ్య, అనిర్బన్‌ ముఖర్జీ, ఝాన్సీరాణి, సహాయ కార్యదర్శులు సామ్య గంగూలీ, రిషికేష్‌, కోశాధికారి చక్రవర్తి, కమిటీ సభ్యులు కె. వెంకట్‌, ఆర్‌. వెంకటేష్‌, జె. రాజు, రంగప్ప, రాజన్‌, విల్సన్‌తో పాటు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్