- 9న విద్యార్థి, యువజన నిరసనలు
- 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ప్రదర్శన
- సిఇసి జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఓటు చోరీ ఆరోపణలు, ఎన్నికల సంఘం వ్యవహారశైలికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థి, యువజన ఉద్యమాలను ఉధృతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ పిలుపునిచ్చాయి. ఈ నెల 9న దేశంలోని ప్రధాన నగరాల్లో భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. 10న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారీ శాంతియుత ప్రదర్శన చేపట్టనున్నట్లు వెల్లడించాయి. ఓటు చోరీకి బాధ్యత వహించాలని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్‌ను పునరుద్ఘాటించాయి. శనివారం నాడిక్కడ ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా (పిసిఐ)లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డివైఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు, రాజ్యసభ ఎంపి ఎఎ రహీం, ప్రధాన కార్యదర్శి హిమాగ్నరాజ్ భట్టాచార్య, ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆదర్శ్ ఎం సాజి, శ్రీజన్ భట్టాచార్య, సహాయ కార్యదర్శి ఐషే ఘోష్ తదితరులు మాట్లాడారు. ఈ నెల 2న జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన ఆందోళనపై ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరును ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా 3 వేల మందికి పైగా విద్యార్థులు, యువజన కార్యకర్తలు పాల్గొన్నారని తెలిపారు. ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు జంతర్‌మంతర్ పరిసర ప్రాంతాల్లో భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ, ఆంక్షలను లెక్కచేయకుండా కార్యకర్తలు ముందుకు సాగారని పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసులు బలప్రయోగానికి దిగారని, నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసి పలువురిని గాయపరిచారని విమర్శించారు. కార్యకర్తలందరినీ అదుపులోకి తీసుకోవడానికి మూడు గంటలకు పైగా సమయం పట్టిందంటే విద్యార్థి, యువజన శక్తి ప్రతిఘటన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ ఆందోళన సందర్భంగా అఖిల భారత నాయకత్వంతో సహా మొత్తం 1,204 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారని, వారిలో 389 మంది మహిళలు ఉన్నారని వెల్లడించారు.
ఐక్య ఉద్యమానికి విస్తృత కార్యాచరణ
ఓటు చోరీకి వ్యతిరేకంగా విద్యార్థి, యువజన సంఘాల ఐక్య వేదికను మరింత విస్తృతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నేతలు నిర్ణయించారు. తొలుత వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలతో చర్చలు జరిపి, అనంతరం ప్రగతిశీల విద్యార్థి, యువజన, ప్రజాస్వామిక సంఘాలు, పౌర సమాజ సంస్థలను కలుపుకొని ఉద్యమాన్ని బలోపేతం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ దిశగా దేశంలోని అన్ని విద్యార్థి, యువజన సంఘాలకు లేఖలు రాయనున్నట్లు తెలిపారు.
విప్లవ వీరుడు చే గువేరా వర్థంతి సందర్భంగా ఈ నెల 9న ‘గుడ్ బై జ్ఞానేష్’ నినాదంతో దేశంలోని ప్రధాన నగరాల్లో భారీ ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. వీటిని క్రమంగా దేశవ్యాప్త ఉద్యమంగా విస్తరించనున్నట్లు వెల్లడించారు. 10న జంతర్ మంతర్ వరకు భారీ శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. 7, 8 తేదీల్లో దేశవ్యాప్తంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ‘ఓటు కీ ఆవాజ్’ (ఓటు గొంతుక) పేరుతో విద్యార్థుల అభిప్రాయ సేకరణతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ నేతలు తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగింపునకు గురైన యువతను నేరుగా కలుసుకొని, వారిని ఉద్యమంలో భాగస్వాములను చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నేతలు తెలిపారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం విస్తృత స్థాయిలో ప్రజా ఉద్యమాన్ని నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో డివైఎఫ్‌ఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు జైక్ సి థామస్, వికాస్ ఝా తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)