• ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ప్రతిపక్షాల పట్టు
• ఉభయ సభల్లో కొనసాగిన ఆందోళన
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో కుప్పకూలిన విద్యా వ్యవస్థకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాల ఆందోళనతో గురువారం పార్లమెంట్ స్తంభించింది. వరుసగా మూడో రోజు కూడా లోక్‌సభ, రాజ్యసభలో ప్రతిపక్షాల నిరసనల హోరు కొనసాగింది. దీంతో ఉభయ సభలు వాయిదాల పర్వం తొక్కాయి. లోక్‌సభను స్పీకర్ ఓం బిర్లా ప్రారంభిస్తూ ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. అయితే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపిలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాల హోరెత్తించారు. దీంతో సభను రెండు నిమిషాల్లోనే మధ్యాహ్నం 12 వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు ఆందోళనను కొనసాగించాయి. దీంతో సభను తొమ్మిది నిమిషాల్లోనే మధ్యాహ్నం రెండు గంటలకు ప్యానెల్ స్పీకర్ దిలీప్ సైకియా వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో అదే పరిస్థితి నెలకొంది. దీంతో సభను మూడు నిమిషాల్లో ప్యానెల్ స్పీకర్ సైకియా నేటీకి వాయిదా వేశారు. పేపర్ లీక్ జరిగిన ట్టు ప్రభుత్వం అంగీకరిస్తే వెంటనే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎస్‌పి అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.
రాజ్యసభలోనూ..
ఎగువ సభలో కూడా ప్రతిపక్షాలు విద్యార్థులపై అణచివేత, లాఠీచార్జ్ అంశంపై చర్చించాలని పట్టుపట్టాయి. కానీ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ అందుకు అంగీకరించలేదు. గందరగోళ నేపథ్యంలో ప్రారంభమైన ఏడు నిమిషాల్లోనే సభను మధ్యాహ్నం 12 గంటలకు వరకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి. దీంతో సభను రెండు నిమిషాల్లోనే మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళనతో 39 సెకెన్లలోనే సభను డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా వేశారు అనంతరం ప్రారంభమైన సభలో రూల్ 267 కింద చర్చ చేపట్టాలని కోరుతుంటే ప్రభుత్వం అంగీకరించట్లేదని ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కేంద్రం అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాతే తాము ఏ చర్చకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. నీట్‌పై చర్చ నుంచి తప్పించుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని ఆరోపించారు. చర్చ ముందు షరతులు పెట్టడం భావ్యం కాదని అన్నారు. ఈ అంశంపై తన వాదన వినిపించే హక్కు ప్రభుత్వానికి కూడా ఉంటుందని అన్నారు. అధికార, ప్రతిపక్షాల నిరసనల మధ్య సభను ఒక్క నిమిషంలోనే నేటీకి వాయిదా వేశారు.
పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాలు ఆందోళన
విద్యార్థులపై పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. గురువారం పార్లమెంట్ ఆవరణంలో మకర ద్వారం ఎదురుగా ప్రతిపక్ష ఎంపిలు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ, ప్రతిపక్షనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ఎస్‌పి అధినేత అఖిలేష్ యాదవ్, ఎస్‌పి ఎంపి రాంగోపాల్ యాదవ్, సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్, సిపిఐ ఎంపి సంతోష్ కుమార్, ఎన్‌సిపి ఎంపి సుప్రియా సూలే, జెఎంఎం ఎంపి మహువా మాంఝీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ దేశ యువత ఏ విజయం సాధించినా తన ఖాతాలో వేసుకునే ప్రధాని.. విద్యార్థులపై దాడులకు కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గురువారం పార్లమెంట్ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులను తాను ఎంతో ప్రేమగా చూసుకుంటానని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టే ప్రధాని మోడీ వారిపై బాష్పవాయువు ప్రయోగించి లాఠీఛార్జ్ చేయించారని విమర్శించారు. అధికార పక్షానికి చెందిన ఎంపిలు పార్లమెంట్ బయట నిల్చొని ఆందోళన చేస్తున్నారని అన్నారు. పిల్లలు ఆందోళన చేస్తుంటే ఇంటర్నెట్ కట్ చేస్తున్నారని విమర్శించారు. వాళ్లు ఉగ్రవాదులు కాదని, ఆందోళన చేస్తున్న వారిపై బాష్పవాయువు ప్రయోగించారని, ఇష్టమొచ్చినట్లుగా లాఠీలతో కొట్టారని ప్రియాంకా అన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్, దాడి ఘటనలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె కోరారు.







కామెంట్‌లు (0)