మూడేళ్ళలో నాలుగుసార్లు !
పేపర్ లీక్‌లపై ఇచ్చిన హామీలనే పునరుద్ఘాటించిన ప్రధాని
న్యూఢిల్లీ : పాడిందే పాటరా ! పాచి పళ్ల ..చందంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మళ్లీ పాత పాటే ఆలపించారు. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడుతూ జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీపై ఇదిగో ఇన్నాళ్లకు ఆయన నోరిప్పారు. అది కూడా సామాజిక మాధ్యమాల్లో..లీకేజీ వ్యవహారంపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తమకు యువత, విద్యార్థుల సంక్షేమం, భవిష్యత్తు కంటే మరేదీ ముఖ్యం కాదంటూ చెప్పుకొచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో గురువారం నాడు ఒక పోస్టు పెట్టారు. ‘పేపర్ లీకేజీలకు కారకులైన వారిపై త్వరితగతిన, కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం. యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కన్నా మరేదీ ముఖ్యం కాదు. మన యువత భవిష్యత్తును దెబ్బతీసేవారిని సహించేది లేదు. ఇందుకు సంబంధించి సంబంధిత అధికారులను అవసరమైన చర్యలన్నీ తీసుకోవాల్సిందిగా ఆదేశించాం. విద్యార్ధుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తీసుకుంటున్న చర్యల పరంపరకు ఇది కొనసాగింపు. మన యువత భవిష్యత్తును ఎవరు దెబ్బతీయడానికి ప్రయత్నించినా ఊరుకునేది లేదు’ అని ఆయన పోస్టు చేశారు. అయితే సాయుధ భద్రత బలగాలు, పోలీసులు, ఖాకీ దుస్తుల్లో చొరబడిన కాషాయ మూకల బరితెగింపు దాడులతో పార్లమెంటు సాక్షిగా ఢిల్లీ వీధులు విద్యార్థుల రక్తంతో తడిసిన తర్వాత ప్రధాని చేసిన ఈ ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జంతర్‌మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనల గురించి అస్సలు ప్రస్తావించకపోవడం, విద్యార్థుల ప్రధాన డిమాండ్ అయిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఊసెత్తకపోవడం..పోలీసుల దాష్టికాలపై కనీస ప్రస్తావన కూడా చేయకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పేపర్ లీకేజీలపై గురువారం నాడు ప్రధాని మోడీ చేసిన ప్రకటన కొత్తదేమీ కాదు. ఇదే తరహాలో గత మూడేళ్లలో ఆయన ప్రకటన చేయడం ఇది నాలుగో సారి. కానీ ఇప్పటి వరకు ఆ ప్రకటనలకు గానీ, హామీలకు గానీ కార్యచరణ లేకపోవడం సిగ్టు చేటు అని విమర్శకులు అంటున్నారు. పార్లమెంట్ లోపల, ఎన్నికల ప్రచార పర్వంలో అనేకసార్లు ప్రధాని మోడీ ఇదే తరహా పదాలు ఉపయోగించారు. ఇవే హామీలు ఇచ్చారు. ఇందుకు సంబంధించి కొన్ని ఉదాహరణలు చూద్దాం.
2024 జులైలో : సరిగ్గా రెండేళ్ళ క్రితం పార్లమెంట్‌లో ప్రధాని మాట్లాడుతూ దాదాపుగా ఇదే రీతిలో హామీలిచ్చారు. 2024 జులై 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియచేసే తీర్మానానికి లోక్‌సభలో సమాధానమిస్తూ, యువతను ఎవరైనా మోసం చేస్తే ప్రభుత్వం వారిని వదిలిపెట్టబోదని అన్నారు. పేపర్ లీకేజీల గురించి రాష్ట్రపతి తన ప్రసంగంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు నివారించేందుకు ప్రభుత్వం చాలా సీరియస్‌గా వ్యవహరిస్తోందని, యుద్ధ ప్రాతిపదికపై మా బాధ్యతలను నిర్వర్తించడానికి ఒకదాని తర్వాత ఒకటిగా చర్యలు తీసుకుంటూ వస్తున్నామని చెప్పారు. నీట్ పేపర్ లీక్ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికే కఠినమైన చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. మొత్తంగా పరీక్షా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఆ మరుసటి రోజే జులై 3న రాజ్యసభలో సమాధానమిస్తూ ఇదే రీతిలో ప్రకటన చేశారు. ఈ అవకతవకలను అడ్డుకునేందుకే పార్లమెంట్ కఠిన చట్టాలను రూపొందించిందని చెప్పారు. ఈ దేశ యువత తమ భవిష్యత్తు కోసం ఆందోళన చెందకుండా చూడాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమని స్పష్టం చేశారు. యుజిసి-నెట్ పరీక్షను ఆ ఏడాది జూన్ 18న నిర్వహించి, 19న రద్దు చేసేశారు. అదే ఏడాది మే 5న నీట్(యుజి) నిర్వహణలో అవకతవకలు జరగడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో పరీక్ష రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
2024 ఫిబ్రవరిలో : 17వ లోక్‌సభ చివరి సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోడీ, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్, 2024ను తమ ప్రభుత్వం ఆమోదించిందన్నారు. పేపర్ లీక్‌లపై యువత ఆగ్రహించడంతోనే తాము ఈ చర్య తీసుకున్నామన్నారు. ఈ వ్యవస్థపై యువత చాలా ఆగ్రహంతో వున్నారు, అందుకే ఈ చట్టం తెచ్చామన్నారు.
2024 డిసెంబరులో : కొన్ని నెలల తర్వాత రాజస్థాన్‌లో బిజెపి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ప్రశ్నా పత్రాల లీక్‌లనేవి రాజస్థాన్ గుర్తింపుగా మారిపోయాయని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించిందని, అనేకమందిని అరెస్టు చేసిందన్నారు. గత ప్రభుత్వం యువతకు అన్యాయం చేసిందన్నారు. అంతకుముందు విద్యార్ధి లోకానికి ఇచ్చిన హామీలనే పునరుద్ఘాటించారు.
2023 నవంబరులో: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు మోడీ మాట్లాడుతూ రాష్ట్రంలో పరీక్షా పత్రాలను కాంగ్రెస్ అమ్ముకుంటోందని విమర్శించారు. పేపర్ లీకేజీలకు బాధ్యులైన వారిని కటకటాల వెనక్కి పంపుతామన్నారు. తమ భవిష్యత్తు కోసం కోటాకు దేశం నలుమూలల నుండి వచ్చే విద్యార్ధుల కలలను కాంగ్రెస్‌పార్టీ నాశనం చేసిందంటూ ఇందుకు బాధ్యులైన వారిని శిక్షించే బాధ్యత మాది, ఇది మోడీ హామీ అని ఆయన చెప్పారు. అదే ఏడాది అక్టోబరు 5న కూడా ఎన్నికల సభలో మాట్లాడుతూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇవే హామీలు ఇచ్చారు.







కామెంట్‌లు (0)