బుధవారం, 05 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కంప్యూటర్‌ ఆధారిత పరీక్షగా నీట్‌ యుజి.. కేంద్రం పరిశీలన

1 గంట క్రితం

NEET-UG
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 01:34 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : నీట్‌-యుజిని కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష‍ (సిబిటి) విధానంలో నిర్వహించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. నీట్‌ యుజి పరీక్ష‍ను పెన్‌ అండ్‌ పేపర్‌ విధానం నుండి కంప్యూటర్ ఆధారిత పరీక్ష‍గా మార్చే అంశాన్ని ‘ సంబంధిత వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయని’’ విద్యాశాఖ పేర్కొంది. జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (మెయిన్స్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌) తరహాలో, పరీక్ష‍ను ఒక దశలో లేదా రెండు దశల్లో నిర్వహించేలా కంప్యూటర్‌ ఆధారిత విధానానికి మారే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. కొన్ని ప్రత్యేక కారణాల దృష్ట్యా, నీట్‌-యుజి ఒక ప్రత్యేకమైన పరీక్ష‍. సుమారు 22లక్ష‍లమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో అత్యధిక భాగం గ్రామీణ ప్రాంత అభ్యర్థులు, మహిళలు ఉన్నారని వెల్లడించింది. సిబిటి విధానానికి మారడంపై "తుది నిర్ణయం", ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తీసుకుంటామని వెల్లడించింది. ఆరోగ్యమంత్రిత్వ శాఖ, జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసి)ని సంప్రదించిన అనంతరం, వారి సమ్మతి మేరకు నీట్‌-యుజి పరీక్ష‍లో నిర్మాణాత్మక మార్పులను చేపడతామని తెలిపింది. పరీక్షా విధానం లేదా రూపకల్పనలో ఏవైనా మార్పులు ఉంటే, అభ్యర్థులకు ముందుగానే సమాచారం అందించడానికి కేంద్రం కట్టుబడి ఉందని, దీంతో ఈ మార్పు ప్రక్రియ సజావుగా, న్యాయబద్ధంగా, అభ్యర్థులపై అనవసరమైన ఒత్తిడి లేకుండా కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది. ప్రభుత్వం ప్రతి పబ్లిక్ పరీక్ష పూర్తయిన తర్వాత ఆ పరీక్ష నిర్వహణలో ఎదురైన అనుభవాలు, సమస్యలు, నేర్చుకున్న పాఠాలను "ఇన్‌స్టిట్యూషనల్‌ మెమరీ బ్యాంక్‌’’గా రికార్డు చేయనున్నట్లు తెలిపింది. ప్రతి పరీక్ష అనంతరం ప్రభుత్వం ‘‘లెర్నింగ్‌ నోట్‌’’ అనే అధికారిక నివేదికను సిద్ధం చేయనున్నట్లు ప్రకటించింది.పరీక్షల నిర్వహణకు అవసరమైన సైకోమెట్రిక్స్, సమాచార సాంకేతికత (ఐటీ), సైబర్ సెక్యూరిటీ, కార్యాచరణ నైపుణ్యాల వంటి రంగాల్లో నిపుణుల నియామకాలను నోటిఫై చేశామని అఫిడవిట్‌లో పేర్కొంది.

ఆగస్టు 4 నాటి అఫిడవిట్‌ను మంగళవారం ఆలస్యంగా సంబంధిత పక్షాలకు అందించారు. నీట్‌-యుజి ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత, సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన మొదటి అఫిడవిట్ ఇది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్