బుధవారం, 05 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

‘హోంమంత్రి ప్రకటన చేయాలి’ : పార్లమెంటులో ప్రతిపక్ష‍ాల డిమాండ్‌

1 గంట క్రితం

Parliament -1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 11:50 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : విద్యార్థులపై పోలీసులసు దాడిపై హోంమంత్రి అమిత్‌షా ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష‍ాలు బుధవారం పార్లమెంటులో నిరసన చేపట్టాయి. అలాగే అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగంపై చర్చ, జమ్ముకాశ్మీర్‌కి రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్‌ చేశారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్లమెంటులోని ప్రేరణా స్థల్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం నుండి మకర ద్వారం వరకు పాదయాత్ర చేపట్టారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎస్పీకి చెందిన డింపుల్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్, టీఎంసీకి చెందిన సాగరిక ఘోష్, మహువా మోయిత్రా, ఎన్‌సీపీ (ఎస్పీ)కి చెందిన సుప్రియా సూలే, జేఎంఎంకు చెందిన మహువా మాజీ, ఆర్‌ఎస్‌పీకి చెందిన ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్ తదితరులు నిరసనలో పాల్గొన్నారు. 'ఛందా చోర్, గడ్డి చోర్', 'అమిత్ షా జవాబ్ దో', 'ఛందా చోర్ కహా మిలేంగే, బీజేపీ కే దఫ్తర్ మే' అంటూ ఎంపిలు నినాదాలు చేశారు.


ఉన్నత పదవుల్లో ఉన్నవారికి ప్రజల పట్ల బాధ్యత ఉంటుందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఇది నియంతృత్వం కాదని, 'రాజ దర్బార్' కాదని అన్నారు. కేంద్రం ఆదేశాలతోనే విద్యార్థులపై పెల్లెట్ గన్‌, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారని, లాఠీఛార్జ్ చేశారని మండిపడ్డారు. ఆదేశాలు ఇచ్చిన వారు బాధ్యత తీసుకోవాలని ప్రియాంక గాంధీ అన్నారు. హోంమంత్రి అమిత్‌షా సభకు ఎందుకు రావడం లేదని రాజ్యసభ ప్రతిపక్ష‍ నేత మల్లికార్జున్‌ ఖర్గే కేంద్రాన్ని ప్రశ్నించారు. ఖర్గే సైతం నిరసనలో పాల్గొన్నారు. కేంద్రం పార్లమెంటును అగౌరవపరుస్తోందని, ఇన్ని రోజులైనా వారు సభకు రాలేదని అన్నారు. సభకు వచ్చి ప్రకటన చేయడంలో ఉన్న సమస్య ఏమిటి అని కేంద్రాన్ని నిలదీశారు. వారు చెవిటివారా, లేదా మూగవారా అని ఎద్దేవా చేశారు. గత నెలలో పేపర్‌ లీక్‌పై జరిగిన నిరసనల సమయంలో విద్యార్థులపై పోలీసులు పాల్పడిన దురాగతాలపై ఉభయ సభల్లో అమిత్‌షా ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష‍ాలు నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే.


అయోధ్య రామ మందిరంలో విరాళాల 'దుర్వినియోగం', జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలన్న డిమాండ్‌ను పలువురు ఎంపిలు లేవనెత్తారు. రాష్ట్ర హోదాపై జమ్ముకాశ్మీర్‌ సహా పలువురు ఎంపిలు ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్రం 2019 ఆగస్టు 5న జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించే ఆర్టికల్ 370 రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్‌, లడఖ్‌ అనే రెండు వేర్వేరు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రం విభజించి నేటితో ఏడేళ్లు పూర్తయింది.



Parliament

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్