గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే : ప్రధాని ప్రకటనపై ప్రతిపక్ష‍ాలు

2 గంటల క్రితం

rahul
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 23, 2026, 11:01 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : పేపర్‌ లీక్‌ కేసుల పరిష్కారం కోసం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేస్తామన్న ప్రధాని మోడీ ప్రకటనపై ప్రతిపక్ష‍ాలు తీవ్రంగా స్పందించాయి. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందేనని ప్రతిపక్ష‍ాలు ముక్తకంఠంతో పేర్కొన్నాయి. లోక్‌సభ ప్రతిపక్ష‍నేత రాహుల్‌ గాంధీ స్పందిస్తూ.. తమ మూడు డిమాండ్లను నెరవేర్చాల్సిందేనని స్పష్టం చేశారు. ‘‘ ధర్మేంద్ర ప్రధాన్‌ని తొలగించాలి. విద్యార్థులకు క్ష‍మాపణ చెప్పాలి, విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని ఎక్స్‌ వేదికగా పునరుద్ఘాటించారు. ‘‘ దేశ యువత భవిష్యత్తును దెబ్బతీసింది మీరే. మన విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేసేలా అనుమతించారు, ప్రోత్సహించారు. అందుకు బాధ్యులైన ప్రతిఒక్కరినీ మీరు కాపాడారు’’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు.

ప్రధాని మోడీ పాలనలో విద్యావ్యవస్థ క్ష‍ీణించిందని రాజ్యసభ ప్రతిపక్ష‍ నేత మల్లికార్జున్‌ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊరట కలిగించే మాటలు, శాంతి ప్రకటనలు అవసరం లేదని మండిపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్‌ విద్యా వ్యవస్థను తన గుప్పిట్లోకి తీసుకుంది. యువతలో నిరుద్యోగిత రేటు 29శాతం (పిఎల్‌ఎఫ్‌ఎస్‌)కి చేరి ఆందోళనకరంగా మారింది. ప్రైవేట్ ఉద్యోగాలు లేవు, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల నియామకం గరిష్ట స్థాయికి చేరింది. అన్ని మార్గాలు మూసుకుపోయాయి. తమ భవిష్యత్తు గురించి డిమాండ్ చేయడానికి యువత ఎక్కడికి వెళ్ళాలి’’ అని ఖర్గే మోడీ ప్రభుత్వాన్ని నిలదీశారు. యువతపై లాఠీచార్జ్‌ చేయడం, పెల్లెట్‌ గన్‌లు, షాక్‌ బ్యాటన్‌లు ఉపయో గించారని, వారు తమ పిల్లలు కాదన్నట్లు నిర్భయంగా, విచక్ష‍ణారహితంగా, క్రూరత్వానికి పాల్పడ్డారు. ఏసి గదుల నుండి బయటకు వచ్చి , మీనియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడి వీధుల్లో రక్తం చిందించిన యువతీ, యువకుల కళ్లలోకి నేరుగా చూడాలని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుండి తొలగించడం, విద్యార్థులపై జరిగిన అఘాయిత్యాలకు క్షమాపణ చెప్పడం, బాధితులకు న్యాయం అందించడం వంటి యువత మూడు డిమాండ్లను నెరవేర్చాలని ఖర్గే పునరుద్ఘాటించారు.

"కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డా విలేకరుల సమావేశాలు నిర్వహిస్తూ మీడియాతో మాట్లాడుతున్నారు, కానీ ప్రధాన్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. వాస్తవం ఏమిటంటే ప్రధానమంత్రి ఆయనను కాపాడుతున్నారు. రాజీనామా చేయకుండా కాపాడటానికి ధర్మేంద్ర ప్రధాన్‌లో అంత ప్రత్యేకత ఏముంది? ఆయన ఎందుకు పదవి నుంచి తప్పుకోలేదు? మా వైఖరిలో మార్పు లేదు... ముందు రాజీనామా, ఆ తర్వాతే చర్చ," అని టిఎంసి ఎంపి సాగరికా ఘోష్‌ పేర్కొన్నారు.

ఈ ఆందోళన ఎందుకు జరుగుతోంది, యువత ఆందోళనలను ప్రధానమంత్రి ఎందుకు వినడం లేదని ఎస్‌పి ఎంపి ప్రశ్నించారు. లక్షలాది మంది యువకుల భవిష్యత్తు నాశనమైందని, అనేకసార్లు పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని అన్నారు. చాలా మంది అభ్యర్థులు ఇప్పటికే వయోపరిమితిని దాటిపోయారని ఎస్‌పి ఎంపి రామ్‌ గోపాల్‌ యాదవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రధాని ప్రకటనను సిజెపి సైతం తిరస్కరించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్