గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

యువత దేశ భవిష్యత్తు.. వారి మాటలను వినాలి : సినీ నటుల మద్దతు

1 గంట క్రితం

mollywood
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 23, 2026, 01:22 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

తిరువనంతపురం : ఢిల్లీ వీధుల్లో ఆందోళన చేపడుతున్న విద్యార్థులకు పలువురు సినీ నటులు మద్దతు ప్రకటించారు. భాష, పరిశ్రమతో సంబంధం లేకుండా పలువురు నటులు విద్యార్థులకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థులు , యువత భారతదేశ భవిష్యత్తు అని మాలీవుడ్‌ నటుడు అసిఫ్‌ అలీ పేర్కొన్నారు. వారి మాటలను వినాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. నిరసన చేస్తున్న విద్యార్థులు, యువతకు అండగా నిలవడం సమాజం బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఆందోళనకారుల డిమాండ్లను వింటుందని ఆశించాను కానీ.. వారిపై పోలీసుల చర్యలు బాధాకరమని మాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రెహమాన్‌ అన్నారు. విద్యార్థులు శత్రువులు కారని, వారు దేశభవిష్యత్తు అని , వారి డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. విద్య అంటే ఆశ, అవకాశం, మెరుగైన భవిష్యత్తుపై విశ్వాసం. విద్యార్థుల ఆవేదనను విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని నటుడు దుల్కర్ సల్మాన్‌ పేర్కొన్నారు. యువత ఈవిధంగా అనిశ్తితిని ఎదుర్కోవడం బాధాకరమని, విద్యార్థులతో అర్థవంతమైన చర్చలు జరపాలని కోరారు. హింసాత్మక పరిస్థితుల కంటే అర్థం చేసుకుని నిర్మించుకున్న భవిష్యత్తు ఎప్పుడూ బలంగా ఉంటుందని దుల్కర్‌ సల్మాన్‌ ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

మెరుగైన విద్యావ్యవస్థను కోరుతూ విద్యార్థులంతా ఏకంకావడం, వారికి తల్లిదండ్రులు తోడుగా నిలవడం అభినందనీయమని బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ పేర్కొన్నారు. విద్యార్థుల, పోలీసులు మధ్య ఘర్షణలు జరిగి నిరసన.. హింసాత్మకంగా మారడం తీవ్రంగా బాధించిందని అన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారికి, వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. మన భవిష్యత్తు కోసంచేయాల్సిందల్లా విద్యార్థుల మాటలు వినడమేనని ఇంతియాజ్‌ అలీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక నటిగా కాకుండా బాధ్యతాయుతమైన పౌరురాలిగా కష్టాల్లో ఉన్న వారికి మద్దతుగా నిలవడం తన బాధ్యత అని నటి అదితీరావు హైదరీ పేర్కొన్నారు. దీని వెనుక ఎలాంటి రాజకీయాలు ఉండవని అన్నారు. వీరితో పాటు ప్రీతిజింటా, పూజాభట్‌, సోనాక్ష‍ిసిన్హా, షబానా అజ్మీ సహా పలువురు నటులు విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. గాయకులు అర్జిత్‌ సింగ్‌, దిల్జీత్‌ దోసాంజేలు కూడా విద్యార్థులకు మద్దతుగా తమ గొంతుకను వినిపించారు. కానీ తెలుగు పరిశ్రమ నుండి ఒక్కరు కూడా స్పందించకపోవడం గమనార్హం.


నిష్పక్షపాతమైన విద్యావ్యవస్థను కోరుతూ సిజెపి నేతృత్వంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, అక్రమాలకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్రప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్