- వైరల్‌గా మారిన నిరసన దృశ్యాలు
ముంబై: సీజేపీ విద్యార్థుల ఆందోళనకు సంఘీభావంగా ముంబైలో నిర్వహించిన నిరసనలో పోలీసు వ్యాన్ ముందు ఒంటరిగా నిలబడ్డ నటి, మోడల్, వ్యాపారవేత్త రియా యాదవ్‌కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దాదర్‌లోని శివాజీ పార్క్ సమీపంలో బుధవారం జరిగిన నిరసనలో అదుపులోకి తీసుకున్న నిరసనకారులను తరలిస్తున్న పోలీసు వాహనాన్ని ఆమె అడ్డుకున్నారు. కుండపోత వర్షంలో పోలీసు వ్యాన్ ముందే నిలబడి వాహనం కదలకుండా రియా నిరసన తెలపగా, అక్కడున్న నిరసనకారులు నినాదాలతో ఆమెకు మద్దతు తెలిపారు. అనంతరం అదుపులోకి తీసుకున్న నిరసనకారులను పోలీసులు విడుదల చేసినట్లు సమాచారం.
"పోలీసులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోతే, పౌరులుగా మేమే బాధ్యత తీసుకుంటాం. నేను విద్యార్థిని కాకపోయినా, విద్యార్థుల పక్షాన నిలుస్తాను. ఢిల్లీలో నిరసనకారులతో పోలీసులు వ్యవహరించిన తీరు ఆమోదయోగ్యం కాదు" అని రియా మీడియాతో అన్నారు. రియా వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో పలువురు ఆమెను ప్రశంసించారు. హాస్యనటుడు రోహన్ జోషి స్పందిస్తూ, "హృదయాల్లో ఆవేదన ఉన్నా ముంబై యువత శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసింది. రియా ఎప్పటికీ నా హీరో" అని పేర్కొన్నారు.
ఢిల్లీలో సీజేపీ ఆందోళన సందర్భంగా పోలీసుల వ్యవహారానికి నిరసనగా ముంబైలో వరుసగా మూడో రోజు కూడా శివాజీ పార్క్, చైత్యభూమి, చెంబూర్, శివసేన భవన్ ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగాయి. జూలై 18 నుంచి 22 వరకు జరిగిన ఈ నిరసనలకు సంబంధించి ముంబై పోలీసులు 13 కేసులు నమోదు చేశారు.







కామెంట్‌లు (0)