• పార్లమెంటులో చర్చ జరపాల్పిందే
• ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాల ఆందోళన
• నిరసనల మధ్యే బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
• కొనసాగిన వాయిదాల పర్వం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో విద్యార్థులు,యువతపై పోలీసులు చూపిన క్రూరత్వానికి హోంమంత్రి అమిత్‌షానే బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. విద్యార్థులు, యువత చేపట్టిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ సోమవారం నాడు ఉభయ సభల్లోనూ ఆందోళనకు దిగాయి. దీంతో ఉభయ సభలు వాయిదాల పర్వం కొనసాగింది. లోక్‌సభను స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించిన వెంటనే ప్రశ్నోత్తరాలను నిర్వహించేందుకు ప్రయత్నించారు. మరోవైపు ప్రతిపక్ష ఎంపిలు నీట్ అంశం, విద్యార్థులపై పోలీసుల చర్యపై తక్షణమే చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాల హోరెత్తించారు. హోమంత్రి అమిత్ షా జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఎంపిలు తమ తమ స్థానాలకు వెళ్లిచ చర్చలో పాల్గొనాలంటూ స్పీకర్ చేసిన విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. తమ ఆందోళన కొనసాగించారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన మధ్యే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేపర్ లీకేజీ నిరోధక బిల్లును ప్రవేశపెట్టిన తరువాత సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో సభను సాయంత్రం ఐదు గంటలకు వాయిదా వేస్తూ, పేపర్ లీకేజీ నిరోధక బిల్లుపై చర్చ చేపట్టనున్నట్లు ప్రకటించారు. అయితే, ఐదు గంటలకు ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్షాల అందోళన కొనసాగడంతో నేటికి (మంగళవారానికి) వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
రాజ్యసభలోనూ నిరసనల హోరు
మరోవైపు రాజ్యసభలో కూడా అదే పరిస్థితి నెలకొంది. రాజ్యసభను చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రారంభించి కార్యకలాపాల నిర్వహణకు ప్రయత్నించారు. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ విద్యార్థులపై పోలీసుల చర్య అత్యంత అసాధారణమైన ప్రాముఖ్యత కలిగినదని, రాజ్యసభ కార్యవిధాన నియమావళిలోని రూల్ 267 ప్రకారం దీనిపై చర్చ జరపాలని అన్నారు. నిరసనకారులపై జరిగిన హింసకు హోం మంత్రి అమిత్ షానే కారణమని ఆయన పేర్కొన్నారు. దీంతో అధికార పార్టీ సభ్యులు కేకలు వేయడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. వెంటనే చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభలో ఈ విషయాన్ని లేవనెత్తిన ఖర్గే, దీనిపై తక్షణమే చర్చ జరపాలని కోరుతూ తాను రూల్ 267 కింద నోటీసు ఇచ్చానని తెలిపారు. అయితే, రాజ్యసభ ఛైర్మన్ సిపి రాధాకృష్ణన్, ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ విషయాన్ని చేపట్టలేమని, ఈ అంశంపై గతంలో ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. దేశ చరిత్రలో ఇలాంటి సంఘటన ఎన్నడూ జరగలేదని వాదిస్తూ, ఈ విషయంపై సభలో తక్షణమే చర్చ జరగాలని ఖర్గే అన్నారు. అనంతరం ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలోనూ అదే పరిస్థితి నెలకొంది. అయితే ప్రతిపక్షాల ఆందోళన మధ్యే వందేమాతరం గేయానికి సంబంధించిన బిల్లును చర్చకు కేంద్ర హోం సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ పెట్టారు. అయితే ప్రతిపక్షాల ఆందోళనతో సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభను మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగడంతో సభను సాయంత్రం 5:15 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలోనూ ఆందోళన కొనసాగడంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు.
పార్లమెంటు ఆవరణలో ఆందోళన
సోమవారం ఉదయం పార్లమెంట్ ఆవరణంలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ప్లకార్డులతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాల హోరెత్తించాయి. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, ప్రియాంగ్ గాంధీ, జాన్ బ్రిట్టాస్, మహువా మొయిత్రాతో పాటు ఇండియా బ్లాక్ పార్టీల ఎంపిలంతా ఆందోళనలో పాల్గొన్నారు. విద్యార్థుల నిరసనలపై అణచివేతకు పాల్పడిన అమిత్ షాపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. విద్యార్థి నిరసనకారులపై పోలీసుల ఈ చర్యపై హోం మంత్రిత్వ శాఖ జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేశారు. ‘‘ఇప్పుడు అత్యంత ముఖ్యమైనది హోం మంత్రిత్వ శాఖ నుండి జవాబుదారీతనం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో, అమాయక, బలహీన, శాంతియుత నిరసనకారులైన మన పిల్లలను వీధుల్లోకి లాక్కెళ్తూ, వారిపై ప్రొజెక్టైల్ గన్‌లు, పెల్లెట్ గన్‌లు, ఎలక్ట్రిక్ ఆయుధాలను ప్రయోగిస్తుంటే, ఎటువంటి జవాబుదారీతనం లేకుండా ఉండకూడదు’’ అని అన్నారు. అంతకు ముందు రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో ఇండియా బ్లాక్ సమావేశం జరిగింది. ఢిల్లీలో పోలీసుల దురాగతాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి.







కామెంట్‌లు (0)