శనివారం, 24 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఢిల్లీ రాజ్‌ఘాట్‌లో శాంతియుత నిరసన

08 అక్టోబర్, 2026

protes
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 11:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- గాంధీ సమాధి వద్ద నివాళి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌కుమార్‌కు వ్యతిరేకంగా ‌దేశ రాజధానిలో ప్రతిపక్షాల ఆందోళన వరుసగా మూడో రోజూ కొనసాగింది. గురువారం ఇండియా బ్లాక్ కి చెందిన ఎంపిలు మహాత్మాగాంధీ స్మారకమైన రాజ్‌ఘాట్‌కు చేరుకుని శాంతియుతంగా నిరసన తెలిపారు. ఎంపిలతోపాటు వేలాది మంది కార్యకర్తలు కూడా రాజ్‌ఘాట్‌కు తరలివచ్చారు. గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం బిజెపి ప్రభుత్వానికి, ప్రధాన ఎన్నికల కమిషనర్‌‌కు కాస్తంత ‘విజ్ఞత’నివ్వాలంటూ ప్రార్ధించారు. అనంతరం నేతలు నిరసన చేపట్టారు. శుక్రవారం కూడా నిరసన కొనసాగుతుందని ప్రతిపక్ష నేతలు తెలిపారు. శుక్రవారం ఉదయం పార్లమెంట్‌ హౌస్‌ వద్ద సమావేశమయ్యే అవకాశం వుంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే, రాజ్యసభలో సిపిఎం పక్ష నేత జాన్‌ బ్రిట్టాస్‌, ఎంపీలు వి.శివదాసన్‌, ఎ.ఎ.రహీం, రాజ్యసభలో సిపిఐ పక్ష నేత పి.సంతోష్‌కుమార్‌, ఆర్‌జెడి ఎంపి మనోజ్‌ ఝా, తృణమూల్‌ కాంగ్రెస్‌ లోక్‌సభా పక్ష నేత అభిషేక్‌ బెనర్జీ, వయనాడ్‌ ఎంపి ప్రియాంకగాంధీ తదితరులు ఈ నిరసన కార్యక్రమానికి నాయకత్వం వహించారు.​ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ, ఓట్ల పారదర్శకత వుండాలని, తప్పులు చేసినవారు రాజీనామాలు చేయాలని, ప్రభుత్వం ఈ మొత్తానికి జవాబుదారీ వహించాలని డిమాండ్‌ ‌చేశారు. ఢిల్లీ కనాట్‌ప్లేస్‌లోని మొహెట్స్‌ హోటల్‌ నుంచి మూడు బస్సుల్లో రాజ్‌ఘాట్‌కు ఎంపిలు వెళ్లారు. ఆ బస్సులను అనుసరిస్తూ వేలాది మంది కార్యకర్తలు కాలినడకన రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా జ్ఞానేష్‌కుమార్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఢిల్లీలో భారీగా పోలీసు బలగాలు మోహరించినా గత రెండు రోజుల మాదిరిగా గురువారం అడ్డుకోకుండా, రాజ్‌ఘాట్‌లోకి అనుమతించారు. మింటో రోడ్డులో బారికేడ్లు ఏర్పాటు చేసి నిరసనను అడ్డుకునేందుకు ప్రయత్నించినా, ఆ తర్వాత విరమించుకున్నారు.

రాష్ర్టపతితో భేటీ కోసం వేచిచూస్తున్నాం : కాంగ్రెస్‌

​రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కావాలని భావిస్తున్నామని, అందుకోసం ఆమె అప్పాయింట్‌‌మెంట్‌‌ను కోరామని కాంగ్రెస్‌ ‌ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ ‌చెప్పారు. ఈ నెల 2నే తొలిసారిగా అభ్యర్ధించామని, దానిపై సమావేశానికి వచ్చే నేతల పేర్లను ఇవ్వాలని రాష్ట్రపతి భవన్‌ ‌కోరిందని చెప్పారు. తిరిగి పేర్ల జాబితాతో 5వ తేదీన పంపామని, శుక్రవారం వరకు వేచి వుంటామని చెప్పారు.

​సమైక్య సమీకరణకై పిలుపు

​ శుక్రవారం జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద నిరసనల నేపథ్యంలో సిఇసికి వ్యతిరేకంగా సమైక్య సమీకరణ జరగాలని సిజెపి, ఎఐఎస్‌ఎ, ఇతర విద్యార్ధి సంఘాలు పిలుపునిచ్చాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్