న్యూఢిల్లీ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)కు సంబంధించి చట్టబద్ధమైన విధులను ఉల్లంఘించారనే ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై క్రిమినల్ విచారణ జరపాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద న్యాయవాది శైలేంద్ర మని త్రిపాఠి శుక్రవారం ఈ పిటిషన్ దాఖలు చేశారు. మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే జ్ఞానేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలు, జారీ చేసిన మార్గదర్శకాలు, చేపట్టిన సాఫ్ట్‌వేర్ మార్పులు రాజ్యాంగ విరుద్ధమని, చెల్లవని ప్రకటించాలని పిటిషన్ కోరింది. ఎస్‌ఐఆర్‌పై, ఫార్మ్ 6, ఓటర్ల జాబితా డేటా నిర్వహణపై ఎన్నికల ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలు 14 సందర్భాల్లో అభ్యంతరం వ్యక్తం చేశారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తమకు తెలియకుండా లేదా తమ సిఫారసులకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారన్న నిర్ణయాలకు సంబంధించినవే ఈ అభ్యంతరాలని నివేదిక తెలిపింది.
అధికారిక విధులను విస్మరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్ఞానేష్ కుమార్, సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మనీష్ గార్గ్, డైరెక్టర్ జనరల్ (ఐటీ) సీమా ఖన్నా, ఇతర బాధ్యులైన అధికారులపై 'ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950'లోని సెక్షన్ 32 కింద ఫిర్యాదులు నమోదు చేసి, వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఫారం 6ను అనధికారికంగా సవరించడం, ఓటర్ల జాబితా డేటాబేస్‌లను కేంద్రీకరించడం, ఇసిఐనెట్ వ్యవస్థ ద్వారా అర్హులైన ఓటర్లను పునరుద్ధరించడంలో విఫలమవడం, మరియు ఇసిఐ పేరుతో ఓటర్లను చేర్చడాన్ని సవాలు చేస్తూ పశ్చిమ బెంగాల్‌లో 16.10 లక్షల అప్పీళ్లను దాఖలు చేయడం వంటివి ఫిర్యాదు చేయబడిన చర్యలలో ఉన్నాయని పిటిషనర్ ఆరోపిస్తున్నారు.పూర్తి కమిషన్ ఆమోదం లేకుండా లేదా ఎన్నికల కమిషనర్ల మెజారిటీ అభిప్రాయానికి విరుద్ధంగా జ్ఞానేష్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన, ఆమోదించిన లేదా అమలు చేసిన అన్ని నిర్ణయాలు, మార్గదర్శకాలు, ఆదేశాలు మరియు సాఫ్ట్‌వేర్ మార్పులను రాజ్యాంగ విరుద్ధమైనవిగా, అధికార పరిధిని అతిక్రమించినవిగా, ప్రారంభం నుండే చెల్లనివిగా ప్రకటించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు.








కామెంట్‌లు (0)