- బ్రిక్స్ వేదికగా ద్వైపాక్షిక సంబంధాల మెరుగుకు ప్రాధాన్యత
న్యూఢిల్లీ : బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరైన 15 దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల నేతలతో ప్రధాని నరేంద్రమోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆయా దేశాలు, సంస్థలతో సంబంధాల బలోపేతంపై చర్చించారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఆఫ్రికన్ యూనియన్ ఛైర్‌పర్సన్, బురుండి రిపబ్లిక్ అధ్యక్షుడు ఎవరిస్ట్ నదయిషిమియే, ఫిలిప్పీన్స్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్. మార్కోస్ జూనియర్, నైజీరియా ఉపాధ్యక్షుడు కాశీం షెట్టిమా ముస్తఫా తదితరులతో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం విడివిడిగా భేటీ అయ్యారు.
సిరిల్ రామఫోసాతో....
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఇద్దరు నాయకులు వివిధ సహకార రంగాలలో సాధించిన పురోగతిని సమీక్షించారని, ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యంపై అభిప్రాయాలను పంచుకున్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బహుపాక్షిక వేదికలలో సన్నిహిత సమన్వయాన్ని కొనసాగించడానికి ఇరువురు నేతలు అంగీకరించారని పేర్కొంది. దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి చిరుతలను విజయవంతంగా తరలించిన నేపథ్యంలో, అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్‌లో చేరడాన్ని పరిశీలించాలని దక్షిణాఫ్రికాను మోడీ ఆహ్వానించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆఫ్రికన్ యూనియన్ ఛైర్‌పర్సన్‌తో చర్చలు
ఆఫ్రికన్ యూనియన్ ఛైర్‌పర్సన్, బురుండి రిపబ్లిక్ అధ్యక్షుడు ఎవరిస్ట్ నదయిషిమియేతో ప్రధాని మోడీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. 2023లో ఆఫ్రికన్ యూనియన్‌ను జి 20 కూటమిలోకి తీసుకురావడంలో భారతదేశం పోషించిన పాత్రను గుర్తుచేసుకుంటూ, గ్లోబల్ సౌత్‌లో సహకారానికి భారత్ - ఆఫ్రికన్ యూనియన్ భాగస్వామ్యం ఒక కీలక పునాది అని, ఇరు దేశాల మధ్య పలు రంగాల్లో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ఇద్దరు నేతలు నిర్ణయించారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. 4వ భారత్-ఆఫ్రికా ఫోరం సదస్సు (ఐఎఎఫ్ఎస్-IV)ను త్వరగా నిర్వహించాలని అభిప్రాయపడ్డారు.
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడితో భేటీ
ఫిలిప్పీన్స్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్. మార్కోస్ జూనియర్‌తో ప్రధాని భేటీ అయ్యారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, అంతరిక్షం, రైల్వే మౌలిక సదుపాయాలు, విద్య, పర్యాటకం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆవిష్కరణలు, ప్రజల మధ్య సంబంధాల రంగాలలో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని, విస్తరించుకోవాలని నిర్ణయించినట్లు
విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
భారత్-కజకిస్తాన్ ద్వైపాక్షిక చర్చలు
కజకిస్తాన్ రిపబ్లిక్ అధ్యక్షుడు కాస్సిమ్-జోమార్ట్ టోకాయేవ్‌తో మోడీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఇరు దేశాల మధ్య పలు రంగాల్లో ఉన్న సంబంధాలను నాయకులు సమీక్షించారని, ఇటీవలి సంవత్సరాలలో ఇరు దేశాల సంబంధాలు స్థిరంగా అభివృద్ధి చెందడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని విదేశాంగశాఖ పేర్కొంది.
నైజీరియా ఉపాధ్యక్షుడితో భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నైజీరియా ఉపాధ్యక్షుడు కాశీం షెట్టిమా ముస్తఫాతో భేటీ అయ్యారు. భారత్ - నైజీరియా బహుముఖ సంబంధాలను నేతలు సమీక్షించారని, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఇంధన భాగస్వామ్యం, వ్యవసాయం, ఆరోగ్యం, డిజిటల్ టెక్నాలజీలతో సహా కీలక రంగాలపై చర్చించినట్లు తెలిపింది.
ఉగాండా రిపబ్లిక్ ఉపాధ్యక్షురాలితో భేటీ
ఉగాండా రిపబ్లిక్ ఉపాధ్యక్షురాలు జెస్సికా రోజ్ ఎపెల్ అలుపోతో ప్రధాని సమావేశమయ్యారు. "సాంకేతిక భాగస్వామ్యాలు, సామర్థ్య నిర్మాణం, జ్ఞాన భాగస్వామ్యం, పెట్టుబడుల సౌలభ్యం, ఇరు దేశాల మధ్య ప్రైవేట్ రంగ సహకారం ద్వారా కీలక ప్రాధాన్యతా రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించారు. పరివర్తన చెందిన, సంపన్న ఉగాండా కోసం రూపొందించిన 'విజన్ 2040'కి భారతదేశం మద్దతు ఇస్తుందని మోడీ తెలిపారు.
రాహుల్, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం చర్చలు
లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంను అల్పాహార సమావేశానికి ఆహ్వానించి, భారత్-మలేషియా సంబంధాలపై చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాల్గొన్నారు. వాణిజ్యం, సెమీకండక్టర్లు, మౌలిక సదుపాయాలు, రక్షణ రంగాలలో సహకారంపై దృష్టి సారించి ప్రధాని నరేంద్ర మోడీ, ఇబ్రహీం చర్చలు జరిపిన ఒక రోజు తర్వాత ఈ సమావేశం జరిగింది.








కామెంట్‌లు (0)