ఎన్‌టిఎ ఆఫీస్ మార్చ్ ఉద్రిక్తం
పిడిగుద్దులతో, మెడపట్టుకుని బలవంతంగా అరెస్టులు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :పరీక్షా విధానంలోని వైఫల్యాలను ప్రశ్నిస్తూ , మూడు యుజిసి-నెట్ పేపర్లను తిరిగి నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు సోమవారం ఢిల్లీలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) కార్యాలయం వెలుపల నిరసన తెలిపారు. పరీక్షలు ముగిసిన 45 రోజుల తర్వాత ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పేపర్లను మళ్లీ నిర్వహించాలన్న నిర్ణయాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు.
విద్యార్థుల జీవితాలతో చెలగాటం..
దేశంలోని విద్యార్థుల జీవితాలను ఎన్‌టిఎ నాశనం చేస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌టిఎ చర్యలను నిరశిస్తూ ప్రధాన కార్యాలయానికి విద్యార్ధులు మార్చ్ చేపట్టారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నేతృత్వంలోని వామపక్ష విద్యార్థి సంఘాలు నిర్వహించిన ఈ మార్చ్‌లో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. యుజిసి నెట్ పరీక్ష రద్దుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న బాలికలతో సహా విద్యార్థులను పోలీసులు, కేంద్ర బలగాలు బలవంతంగా అరెస్టు చేశాయి. ఎఐఎస్ఎఫ్, దిశ, ఎఐఎస్ఒ, ఎఐఎస్ఎ సంఘాలు కూడా ఈ మార్చ్‌లో పాల్గొన్నాయి. అయితే, విద్యార్థులు ప్రదర్శనకు దిగి నిరసన తెలుపుతున్నప్పుడు, బలగాలు దారుణానికి పాల్పడ్డాయి. నిరసన తెలుపుతున్న విద్యార్థులను కొట్టి, అక్కడినుంచి బలవంతంగా తీసుకెళ్లి, పోలీసు వాహనంలోకి ఎక్కించారు. ఎస్ఎఫ్ఐ ఢిల్లీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మెహినా ఫాతిమా, రాష్ట్ర కమిటీ సభ్యురాలు శరణ్య వర్మలను పోలీసులు ఈడ్చుకెళ్లారు. మగ పోలీసులు కూడా బాలికలపై దాడి చేశారు. వారు విద్యార్థినుల మెడలు పట్టుకుని ఊపిరి ఆడకుండా చేశారు. పలువురు గాయపడ్డారు.
విద్యార్థులు దాడిని తిప్పికొట్టడంతో భద్రతా దళాలు సంక్షోభంలో పడ్డాయి. ప్రధాన కార్యాలయం నుంచి కార్యకర్తలను తొలగించడానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. ఇందుకోసం ఎన్‌టిఎ ప్రధాన కార్యాలయం ముందు ఏడు పోలీసు వాహనాలు వచ్చాయి. పదేపదే పరీక్షలలో విఫలమవుతున్న ఎన్‌టిఎను రద్దు చేయాలని, పునఃపరీక్షలు జరుగుతున్న సబ్జెక్టులకు రీఫండ్‌లు ఇవ్వాలని, పునఃపరీక్షలలో పరీక్షా కేంద్రాలను మార్చుకునేందుకు అనుమతించాలని, పునఃపరీక్షల కారణంగా పిహెచ్‌డి ప్రవేశాలు, ఫెలోషిప్‌లు, ఇతర విద్యా అవకాశాలలో జాప్యం జరగకూడదని, పరీక్షలలోని అవకతవకలపై స్వతంత్ర విచారణ జరపాలని ఎస్ఎఫ్ఐ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి సూరజ్ ఇలామన్, అధ్యక్షురాలు నాడియా డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)