వైసిపి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
వైద్య విద్యార్థిని ప్రియాంక మృతికి వైసిపి నిరసన
ప్రజాశక్తి, మండపేట :
రాష్ట్రంలో మహిళా హోం మంత్రి ఉన్నప్పటికీ శాంతిభద్రతల పరిరక్షణ పూర్తిగా కరువైందని మండపేట నియోజకవర్గ వైసిపి ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. వైద్య విద్యార్థిని ప్రియాంక మృతికి నిరసనగా వైసిపి ఆధ్వర్యంలో కరాచీ సెంటర్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఆమె ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం తోట త్రిమూర్తులు మాట్లాడుతూ..మద్యం మత్తులో ఉన్న ఉన్మాదుల నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందడం అత్యంత దారుణమన్నారు. తాగుబోతుల ఉన్మాదానికి ఒక మహిళా డాక్టర్ ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో సమాధానం చెప్పాలని నిలదీశారు. బాధితురాలి కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చట్టాల కింద కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, మండపేట నియోజకవర్గ పరిశీలకులు ఒంటెద్దు వెంకన్న నాయుడు, మాజీ ఛైర్మన్ పతివాడ నూక దుర్గా రాణి, రాయవరం ఎంపీపీ నాడు వెంకటరమణ, రాష్ట్ర వైసిపి బీసీ సెల్ కార్యదర్శి కుడిపూడి రాంబాబు, రాష్ట్ర వైసిపి ఎస్సీ సెల్ కార్యదర్శి పలీవెల సుధాకర్, మాజీ సర్పంచ్ గారపాటి అశోక్ కుమార్, జేసీబీ వెంకటేశ్వరావు తదితర నాయకులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)