- బరిలో 21మంది అభ్యర్థులు
- భవితవ్యాన్ని తేల్చనున్న 2.20లక్షల ఓటర్లు
దతియా:మధ్యప్రదేశ్‌లోని దతియా అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు గురువారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది.సాయంత్రం 6గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది.ఈ ఉప ఎన్నికలో 21మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యాన్ని 2,20,344మంది ఓటర్లు నిర్ణయించనున్నారు.ఈ ఎన్నికలో అధికార బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీ,కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.ఆజాద్ సమాజ్ పార్టీ అభ్యర్థి దామోదర్ సింగ్ యాదవ్ కూడా బరిలో ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది.ఎన్నికల సంఘం మొత్తం 291పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.వీటిలో 186గ్రామీణ, 105పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి.నియోజకవర్గంలో 1,16,088మంది పురుషులు, 1,04,246మంది మహిళా ఓటర్లు ఉన్నారు.పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని,ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ వాంఖేడే తెలిపారు.భద్రతా దృష్ట్యా భారీగా పోలీసు బలగాలను మోహరించామని,ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మయూర్ ఖండేల్వాల్ వెల్లడించారు.
2023అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్ర భారతి విజయం సాధించగా,మోసపూరిత కేసులో శిక్ష పడడంతో ఆయన అనర్హతకు గురయ్యారు.దీంతో దతియా నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.ఈసారి బీజేపీ మాజీ మంత్రి నరోత్తమ్ మిశ్రాకు టికెట్ ఇవ్వకుండా అశుతోష్ తివారీని అభ్యర్థిగా ప్రకటించగా,దీనిపై మిశ్రా మద్దతుదారులు నిరసనలు వ్యక్తం చేశారు.ఈ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆగస్టు 3న జరగనుంది.








కామెంట్‌లు (0)