ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆయుష్‌ మాలిక్‌ను కోర్టు ఎదుట హాజరుపరచండి

1 గంట క్రితం

Allahabad high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 06:54 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • యుపి పోలీసులకు అలహాబాద్‌ హైకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ : తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా ఇస్లాం మతాన్ని స్వచ్ఛందంగా స్వీకరించి, ముస్లిం యువతిని వివాహం చేసుకున్న తర్వాత కుటుంబంతో నిర్బంధించబడ్డాడని ఆరోపించబడిన ఆయుష్‌ మాలిక్‌ను తమ ఎదుట హాజరుపరచాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తరప్రదేశ్ పోలీసులను ఆదేశించింది. ​కొడుకు నిర్బంధంలో తండ్రికి ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు సహకరించారన్న ఆరోపణలు తీవ్రమైనవని పేర్కొంది. తన పేరును మహమ్మద్‌ అలీగా మార్చుకున్నానని, స్వచ్ఛందంగా ఇస్లాం మతం స్వీకరించానని మాలిక్‌ గతంలో మీడియాకు చెప్పడం గమనార్హం. ఆయుష్ మాలిక్ స్నేహితుడైన మహమ్మద్ సుల్తాన్ దాఖలు చేసిన 'హెబియస్ కార్పస్' పిటిషన్‌లోని వివరాల ప్రకారం... చాందిని ఖురేషీని మాలిక్‌ వివాహం చేసుకుని, ఇస్లాం మతంలోకి మారాడు. ఇస్లాంలోకి మారేలా చాందిని తన కుమారుడిని ఒత్తిడి చేసిందన్న మాలిక్‌ తండ్రి దేవరాజ్‌ ఫిర్యాదుతో ఆమెతోపాటు ఆమె తండ్రి ఇస్లాంపై 'ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ చట్టం, 2021' కింద కేసు నమోదు చేశారు. ​వారు కొన్ని నెలల పాటు జైలులో ఉన్నారు. ఈ అంశంపై ఈ నెల 9న మహమ్మద్ సుల్తాన్ అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన జస్టిస్‌ సందీప్‌ జైన్‌... మాలిక్‌ తన తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా ఇస్లాం మతాన్ని స్వీకరించి, ముస్లిం మహిళను వివాహం చేసుకున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. "మాలిక్‌ను అక్రమంగా నిర్బంధించారని, ఆ నిర్బంధంలో ప్రభుత్వ యంత్రాంగం, అధికారుల ప్రమేయం ఉందన్న పిటిషనర్‌ తరపు న్యాయవాదుల ఆరోపణలు తీవ్రమైనవని, న్యాయస్థానం తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని" పేర్కొన్నారు. ఈ నెల 16న అతడిని కోర్టు ముందు హాజరుపరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, మాలిక్ తండ్రిని హైకోర్టు ఆదేశించింది. మాలిక్‌ను కోర్టు ముందు హాజరుపరచని పక్షంలో, అతడిని హాజరుపరచకపోవడానికి గల కారణాలను, అతడు హాజరయ్యేలా చేయడానికి తీసుకున్న చర్యలను రాష్ట్ర అధికారులు వెల్లడించాలని పేర్కొంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్