ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అమిత్ షా రాజీనామా కోసం నిరసన

01 ఆగస్టు, 2026

aisu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 11:43 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఎఐఎస్ఎ అధ్యక్షురాలు నేహా

న్యూఢిల్లీ : ఢిల్లీలో జులై 20న నిరసనకారులపై పాశవిక దాడికి బాధ్యుడైన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని, పోలీసు చర్యకు కేంద్రం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమిస్తామని ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (ఎఐఎస్‌ఎ) అధ్యక్ష‍ురాలు నేహా తెలిపారు. ఆందోళన సమయంలో 23 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన నేహా పిటిఐతో మాట్లాడారు. ఢిల్లీ ఉద్యమంలో పాల్గొన్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోబోమని హామీలు ఇచ్చినప్పటికీ విద్యార్థులపై అరెస్టులు, క్రిమినల్ కేసులు కొనసాగుతున్నాయని విమర్శించారు. “పాశవిక దాడికి అంతిమ బాధ్యత అమిత్ షా, పోలీస్ కమిషనర్‌లదే. ఎవరైనా రాజీనామా చేయాలన్నా లేదా తొలగించాలన్నా, అది ఈ ఇద్దరిదే. ఏ కింది స్థాయి అధికారి సస్పెన్షన్ మాకు సరిపోదు,” అని ఆమె అన్నారు. భద్రతా సిబ్బందికి పెల్లెట్ గన్‌లు, మేకులు కొట్టిన కర్రలు ఎందుకు ఇచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. "ఒకవేళ అది మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు జరిగి ఉంటే, మీరెలాంటి హోం మంత్రి? ... ఒకవేళ అది మీ ఆదేశాల మేరకు జరిగి ఉంటే, సాధారణ పౌరులపై పెల్లెట్ గన్‌లతో కాల్పులు జరిపేలా మీరు ఎలాంటి నేరపూరిత వ్యవస్థను నడుపుతున్నారు?" అని ఆమె ప్రశ్నించారు. ప్రశ్నాపత్రం లీక్ సమస్యపై ప్రారంభమైన ఉద్యమం ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా సాగే విస్తృత రాజకీయ పోరాటంగా మారిందని అన్నారు. "చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు మా దగ్గరకు వచ్చి, తాము బిజెపి ప్రభుత్వానికి ఓట్లు వేస్తూ వచ్చామని, నేడు తమ ఓటు వల్లే నిరాహార దీక్ష చేయాల్సి వస్తోందని చెప్పేవారు. తమ ఓటు వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇప్పుడు తాము చాలా సిగ్గుపడుతున్నామని అనేవారు," అని అన్నారు. "హోం మంత్రి రాజీనామా, అరెస్టు చేసిన విద్యార్థుల విడుదల కోసం జరుగుతున్న నిరసనలు వేర్వేరు కావు. రెండూ ప్రభుత్వ అణచివేతలో భాగమే కాబట్టి అవి కలిసి ఉన్నాయి," అని ఆమె అన్నారు. పార్లమెంటులో గళం విప్పడం ప్రతిపక్ష‍ాల బాధ్యత అని చెప్పారు. "ప్రజలు ఈ ఉద్యమాన్ని మర్చిపోరని నేను భావిస్తున్నాను. విభజన రాజకీయాలను పక్కనపెట్టి, మన భవిష్యత్తు కోసం కలిసి పోరాడినప్పుడు మనం విజయం సాధించామన్న విషయాన్ని మనం మర్చిపోము," అని ఆమె అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్