స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న వైద్యులు
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకూ ఆందోళన కొనసాగుతోంది : సిజెపి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నీట్ ప్రశ్నాపత్రం లీక్, సిబిఎస్ఇ అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువత చేస్తున్న ఆందోళన తీవ్రతరం అవుతోంది. జంతర్ మంతర్ వద్దకు పెద్ద ఎత్తున యువత చేరుకుంటున్నారు. పోలీసులు, కేంద్ర బలగాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న క్రూరమైన అణచివేత చర్యలను ప్రతిఘటిస్తూ సిజెపి, విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన ఈ ఆందోళన బలం పుంజుకుంటోంది. బుధవారం కూడా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి జంతర్ మంతర్‌కు ప్రజల ప్రవాహం కొనసాగింది. నిరసనను విచ్ఛిన్నం చేసే లక్ష్యంతో ప్రభుత్వం, పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలు, ఇంటర్నెట్ నిషేధాన్ని సైతం అధిగమించి జంతర్ మంతర్‌కు ప్రజలు తరలివచ్చారు. జంతర్ మంతర్ వద్దకు మల్లయోధులు వచ్చి సంఘీభావం తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, పోలీసుల క్రూరత్వానికి ముగింపు పలకాలని డిమాండ్ చేస్తూ బజరంగ్ పునియా నిరసనలో పాల్గొన్నారు. సిపిఎం సీనియర్ నేత బృందా కరత్, ఎస్‌కెఎం నేత రాకేష్ టికాయిత్ విద్యార్థులకు, యువతకు మద్దతుగా జంతర్‌మంతర్ వద్దకు చేరుకుని ఆందోళనలో భాగస్వామ్యం అయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ, అంతర్జాతీయంగా ఆందోళనలు కొనసాగాయి.
బహిరంగ చర్చలకు డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళన ఆపబోమని సిజెపి ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. నిరసనకారులతో చర్చలకు ప్రభుత్వం మరోసారి అంగీకరించిన ప్పటికీ, జెపి నడ్డా నివాసంలో చర్చలకు తాము సిద్ధంగా లేమని సిజెపి స్పష్టం చేసింది. నిరసన కేంద్రంలో గానీ, జంతర్ మంతర్ సమీపంలో గానీ చర్చలు జరపవచ్చని సిజెపి తెలిపింది. అంతేతప్ప వ్యక్తుల నివాసాల్లో, కార్యాలయాల్లో చర్చలకు తాము సిద్ధంగా లేమని, చర్చలు బహిరంగంగానే *జరగాలని స్పష్టం చేసింది. జంతర్ మంతర్ వద్ద సిజెపి, విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన బుధవారం 33 రోజు కొనసాగింది.సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష బుధవారానికి 26 రోజులు పూర్తయింది. వాంగ్‌చుక్ ప్రస్తుతం మెదాంత ఆసుపత్రిలో ఉన్నారు. పార్లమెంటు మార్చ్‌లో పాల్గొన్న నిరసనకారులపై చట్టపరమైన చర్యలను ఉపసంహరించుకుని, అణచివేత చర్యలను ఆపితే తాను నిరాహార దీక్షను విరమిస్తానని వాంగ్‌చుక్ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు.. వాంగ్‌చుక్ ను కలవడానికి వచ్చిన ఎంపిలను హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. సిపిఎం ఎంపి ఎఎ రహీం, ఆప్ ఎంపి సంజయ్ సింగ్, జెఎంఎం ఎంపి ముహువా మాంఝీ సహా ఎంపిలు ఆసుపత్రి ముందు కూర్చొని నిరసన తెలిపారు.

ఆందోళనను అణచివేసేందుకు కేంద్రం కుట్రలు
ఆందోళనను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. అందులో భాగంగా ఢిల్లీలో ఇంటర్నెట్‌ను నిషేధించారు. అనేక ప్రధాన రహదారులను బారికేడ్లతో దిగ్బంధించారు. బుధవారం పదహారు మెట్రో స్టేషన్లను మూసివేశారు. నిరసనకు వస్తున్న యువకులను భయపెట్టి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆందోళనను అణచివేసేందుకు పశ్చిమ బెంగాల్ నుంచి 20 కంపెనీల సిఆర్‌పిఎఫ్ బలగాలను ఢిల్లీకి రప్పించారు. ఇదిలా ఉండగా, 25 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న సిజెపి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను నిషేధించారు. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవ్వడంతో మళ్లీ నిషేధాన్ని ఎత్తివేశారు. సిజెపి అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ వాట్సాప్ ఖాతాను మెటా బ్లాక్ చేసింది. నిరసనను చెడుగా చిత్రీకరించే కంటెంట్‌ను పోస్ట్ చేస్తే రూ.40 వేల జరిమానా విధిస్తామని కేంద్ర ప్రభుత్వ పిఆర్ బృందం కంటెంట్ క్రియేటర్లకు సందేశం పంపింది.








కామెంట్‌లు (0)