- ఢిల్లీ పోలీసుల ప్రవర్తనపై రాహుల్ ఆగ్రహం
న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యం కోసం గళం విప్పుతున్న విద్యార్థులపై అలాగే మహిళా నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు దాడులు చేయడం, లైంగిక వేధింపులకు పాల్పడటం.. ప్రజల గొంతుల్ని అణచి వేయడానికి జరుగుతున్న కుట్రలో భాగమని లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నలు అడిగేందుకు ఎవరూ ధైర్యం చేయకుండా భయపెట్టడమే ఈ చర్యల వెనుక ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం నాడు ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘విద్యార్థులు, మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరు అన్ని హద్దులు దాటింది. లైంగిక వేధింపులు, దుస్తులు లాగడం, శరీరంలోని సున్నిత భాగాలపై దాడులు చేయడం వంటి ఘటనలకు పోలీసులు పాల్పడ్డారు. ప్రజాస్వామ్యం కోసం ప్రశ్నిస్తున్న వారిని తీవ్రంగా భయపెట్టి, అవమానించి, భవిష్యత్తులో తమకు వ్యతిరేకంగా మళ్లీ గొంతు విప్పకుండా చేయాలనే ప్రయత్నం జరుగుతోంది. ప్రజాస్వామ్యం కోసం గొంతు విప్పుతున్న మహిళలు, విద్యార్థినులపై ఢిల్లీ పోలీసుల వైఖరి సిగ్గుచేటు. ప్రజల్ని తీవ్రంగా భయపెట్టి, అవమానించి ఇక మీదట ఎవరూ ప్రశ్నలు అడగకుండా చేయాలనే కుట్రలో భాగమే ఇది’ అని ఆయన పేర్కొన్నారు. అధికారం తమ చేతుల్లో నుంచి చేజారిపోయే రోజు వస్తే, తమ ఇష్టానుసారంగా వ్యవహరించే అవకాశం ఇక ఉండదని, ఆ రోజు ముగుస్తుందని వారికి తెలుసని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు.
బాధిత మహిళలతో మాట్లాడిన రాహుల్ ..
తన పోస్టుతో పాటు రాహుల్ గాంధీ సుమారు 10 నిమిషాల వీడియోను కూడా ఎక్స్లో పంచుకున్నారు. ఇటీవల జరిగిన నిరసనల్లో పోలీసులు తమపై అమానుషంగా వ్యవహరించారని ఆరోపించిన కొందరు మహిళలతో ఆయన మాట్లాడిన దృశ్యాలు సదరు వీడియోలో ఉన్నాయి. యువతులు తమకు ఎదురైన చేదు అనుభవాలను వివరించారు. పోలీసులు తమ శరీరంలోని సున్నిత భాగాలను లక్ష్యంగా చేసుకున్నారని, పై అధికారులు కింది స్థాయి సిబ్బందిని లైంగికంగా వేధించేలా ప్రోత్సహించారని కూడా మహిళలు వీడియోలో వివరించారు. తమపై వేధింపులకు పాల్పడిన పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మహిళలు రాహుల్ గాంధీని కోరారు. దీనిపై స్పందించిన ఆయన, సంబంధిత పోలీసులపై కేసులు నమోదు చేయడానికి వీలుగా మరిన్ని ఆధారాలు అందించాలని సూచించారు. ఫొటోలు, వీడియోలు వంటి ఆధారాలను సేకరించి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఈ ఆధారాలను బట్టి కేసులు నమోదు చేసే ప్రక్రియలో ముందుకు వెళ్లొచ్చని ఆయన పేర్కొన్నారు.








కామెంట్లు (0)