కోర్టు ప్రొసీడింగ్స్‌ను ఆపండి
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సుప్రీం ఆదేశాలు
న్యూఢిల్లీ : ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై అలహాబాద్ హైకోర్టు చేపట్టిన కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కనీసం కోర్టులైనా ‘సహజ న్యాయ సూత్రాన్ని’ పాటించాలని వ్యాఖ్యలు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయంటూ కాంగ్రెస్ నేతపై ప్రైవేట్ ఫిర్యాదీదారుడు ఎస్ విఘ్నేష్ శిశిర్ చేసిన ఆరోపణలపై విచారణ జరపాల్సిందిగా సిబిఐ, ఇడిలను ఆదేశిస్తూ హైకోర్టు చర్యలు తీసుకోవడం వేధింపుల కిందకే వస్తుందని రాహుల్ తరపు న్యాయవాదులు కపిల్ సిబల్, ఎస్ ప్రసన్న వాదించారు. దానిపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పై రీతిన స్పందించింది. ‘‘సిబిఐ,ఇడి లేదా మరే ఇతర సంస్థ కూడా హైకోర్టుకు ఎలాంటి నివేదికను అందచేయరాదు..తదుపరి ఆదేశాలు జారీ అయేవరకు విచారణా తేదీని హైకోర్టు వాయిదా వేయాలి.’’ అని సుప్రీం ఆదేశించింది. ఈ నెల 20న హైకోర్టు ఈ కేసును విచారించాల్సి వుంది.
పైగా హైకోర్టు ప్రొసీడింగ్స్ అన్నీ బహిరంగ కోర్టులో కాకుండా న్యాయమూర్తుల చాంబర్‌లో జరిగాయని సిబల్ తెలిపారు. రికార్డులు సీల్డ్ కవర్లలో వుంచారన్నారు. ఆ ఆరోపణలపై రాహుల్ గాంధీ తన వాదన వినిపించడానికి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. ‘‘చట్టం పట్ల మాకున్న అవగాహన ప్రకారం, ఒక ఫిర్యాదు వస్తే పోలీసులు లేదా దర్యాప్తు సంస్థ కేసును నమోదు చేయవచ్చు. అలా చేయడానికి నిందితుడి అనుమతి అవసరం లేదు. కానీ న్యాయస్థానాల పరిస్థితి భిన్నం. ఒకవేళ కోర్టులు గనక ఆదేశాలు (విచారణ/దర్యాప్తునకు) జారీ చేయాలనుకుంటే సహజ న్యాయం సూత్రాలను న్యాయస్థానాలు అనుసరించాల్సి వుంటుంది.’’ అని చీఫ్‌జస్టిస్ సూర్యకాంత్ సిబిఐ తరపు న్యాయవాది అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజును ఉద్దేశించి పేర్కొన్నారు. తాను చట్టానికి పూర్తిగా కట్టుబడి వున్నానని రాజు చెప్పారు. శిశిర్ తన ఫిర్యాదులో ఇచ్చిన అంశాలు నిజం కావచ్చు, కాకపోవచ్చు, కానీ ఒకవేళ అవి నిజమైతే, అది ఆదాయానికి మించి ఆస్తులుండడానికి సంబంధించి తీవ్రమైన కేసే అని అన్నారు. ఆ ఫిర్యాదులో చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని అన్నారు. వాటిని కేవలం పనికిమాలిన వాటిగా కొట్టిపారేయలేమన్నారు. ‘రాహుల్‌పై ఆరోపణలు అంత తీవ్రమైనవైతే ఇంతకాలమూ మీ సంస్థ ఎందుకు మౌనంగా వుంది? న్యాయస్థానం నుండి మీకు ప్రోత్సాహం అవసరమా? దర్యాప్తు ప్రారంభించడానికి మీకు గల చట్టబద్ధమైన అధికారాలను ఉపయోగింవచ్చు...అని జస్టిస్ జోమాల్యా బాగ్చి ప్రశ్నించారు. సిబిఐ తనకు తానుగా పరిగణనలోకి తీసుకుని, విచారణ చేపట్టకుండా వున్నందున సుప్రీం కోర్టు హైకోర్టు ఆదేశాలను సరైనవా కావా అని పరిశీలించాల్సిన అవసరం పడిందని జస్టిస్ బాగ్చి అన్నారు. ‘ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, కోర్టు మిమ్మల్ని ఆదేశిస్తే, దీన్ని తప్పకుండా పరిశీలించాలని మేం భావిస్తాం. ...కోర్టు ఏదైనా చెప్పినపుడు, దానికి సంబంధించి న్యాయస్థానం సమ్మతిని నమోదు చేయాల్సి వుంటుంది. మేం దానిపై పరిశీలిస్తాం.’’ అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కేవియట్‌ను దాఖలు చేసిన శిశిర్‌కు కేస్ పేపర్ బుక్‌ను అందచేయాలని రాహుల్ గాంధీ తరపు పక్షాన్ని కోర్టు కోరింది. కాగా రాజ్యాంగ ధర్మాసనం అత్యంత అరుదుగా వ్యవహరించిన ఘటన అని రాహుల్ వ్యాఖ్యానించారు. అనేక మౌలిక సూత్రాలకు లేదా ప్రాధమిక చట్టబద్ధ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ధర్మాసనం ఈ కేసులో వ్యవహరించిందని అన్నారు.








కామెంట్‌లు (0)