- ప్రధాన్ రాజీనామా వరకు పోరాటం కొనసాగుతుంది
- అభిజిత్ దీప్‌కే ప్రకటన
న్యూఢిల్లీ: జంతర్‌మంతర్‌లో విద్యార్థుల నిరసనకు సంఘీభావంగా 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టిన పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన దీక్షను విరమించడాన్ని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్‌కే స్వాగతించారు. అయితే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఉద్యమం ఆగబోదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. దేశ మనస్సాక్షిని మేల్కొల్పేందుకు సోనమ్ వాంగ్‌చుక్ తన ప్రాణాలను పణంగా పెట్టి 26 రోజుల పాటు కఠోర నిరాహార దీక్ష చేపట్టిన ఆయన అసాధారణ ధైర్యసాహసాలు, త్యాగం ప్రశంసనీయమ పేర్కొన్నారు. దీక్షను విరమించడం ఉపశమనాన్ని కలిగించిందని, ఆయన జీవితం దేశానికి ఎంతో విలువైనదని తెలిపారు. "సోనమ్ గారు తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించడం మాకు ఎంతో సంతోషాన్ని, కలిగించింది. దేశ మనస్సాక్షిని మేల్కొల్పేందుకు ఆయన చేసిన త్యాగానికి కృతజ్ఞతలు. అయితే, నీట్ కుంభకోణానికి బాధ్యుడైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్‌మంతర్‌లో సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతియుత నిరసన కొనసాగుతుంది," అని అభిజిత్ దీప్‌కే స్పష్టం చేశారు.
నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకల కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిన్నదని, దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమవుతోందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్‌లో కొనసాగుతున్న ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని విద్యార్థి సంఘం నిర్ణయించినట్లు తెలిపారు.







కామెంట్‌లు (0)