శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వేగవంతమైన ఆర్థిక పురోగతికి పటిష్ఠమైన న్యాయ వ్యవస్థలే వెన్నెముక

1 గంట క్రితం

supreme
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 12:05 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- సిజెఐ సూర్యకాంత్

న్యూఢిల్లీ : స్థిరమైన ఆర్థిక వృద్ధి అనేది భౌగోళిక లేదా ముడి సహజ వనరులపై మాత్రమే కాకుండా సంస్థాగత స్థిరత్వం, విశ్వాసం, సామర్థ్యంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుందని భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. బ్రిక్స్ ప్లస్ దేశాలు మానవాళిలో 40 శాతానికి పైగా, ప్రపంచ జిడిపి ఉత్పత్తిలో దాదాపు 40 శాతం వాటాను కలిగి ఉన్నాయని చెప్పారు. వేగవంతమైన ఆర్థిక పురోగతికి పటిష్ఠమైన న్యాయ వ్యవస్థలే వెన్నెముక అని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో శనివారం జరిగిన 11వ బ్రిక్స్ ప్లస్ లీగల్ ఫోరంలో జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 'న్యాయ సేతు' (న్యాయ వారధి), 'న్యాయఆర్థిక శాస్త్రం' (న్యాయనామిక్స్) అనే కాన్సెప్ట్‌లను ఆయన పరిచయం చేశారు. బ్రిక్స్ ప్లస్ దేశాలలో చట్టపరమైన, ఆర్థిక శక్తిని ఏకీకృతం చేసేందుకు 'న్యాయనామిక్స్', 'న్యాయ సేతు' దార్శనికత గురించి వివరించారు. 'బహుళ ధ్రువ ప్రపంచంలో చట్టబద్ధ పాలన' అనే అంశంపై జరిగిన ప్రారంభ ప్లీనరీలో ఆయన ప్రసంగిస్తూ.. ‘చట్టబద్ధమైన పాలనకు సంబంధించి న్యాయనమిక్స్ అనే పదాన్ని ప్రతిపాదిస్తున్నాను. సరళంగా చెప్పాలంటే న్యాయ ఆర్థిక శాస్త్రం. ఇది బ్రిక్స్ ప్లస్ దేశాలన్నింటికీ వర్తిస్తుంది. కేసులను డిజిటలైజ్ చేయడంలో భారతదేశానికి ఉన్న అనుభవాన్ని ఆధారంగా చేసుకుని, న్యాయశాస్త్రానికి సంబంధించిన ఒక ఉమ్మడి భాండాగారాన్ని ఏర్పాటు చేయాలి. తద్వారా బ్రిక్స్ ప్లస్ దేశాల అధికార పరిధిలో వెలువడిన తీర్పు, అదే విధమైన చట్టపరమైన ప్రశ్నలతో వ్యవహరించే ఇతర ప్రాంతాలలోని న్యాయస్థానాలకు మార్గదర్శకంగా ఉపయోగపడు తుంది. తద్వారా దిల్లీ, బ్రసీలియాలో రాసిన తీర్పు అదే ప్రశ్నను ఎదుర్కొంటున్న మరోచోట ఉన్న ధర్మాసనానికి తెలియజేయడానికి సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇక న్యాయ సేతు అనేది 11 న్యాయ సంప్రదాయాలను అనుసంధానించే ఒక వారధి’ అని ఆయన తెలిపారు. బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు ఎస్ఎస్ నాగానంద్ మాట్లాడుతూ బ్రిక్స్ దేశాల మధ్య బలమైన న్యాయ సహకారం అవసరాన్ని నొక్కి చెప్పారు. బ్రిక్స్ ఏర్పడినప్పుడు దాని ప్రధాన దృష్టి సభ్య దేశాల మధ్య ఆర్థిక, ద్రవ్య సహకారాన్ని బలోపేతం చేయడంపైనే ఉందని పేర్కొన్నారు. సంవత్సరాలుగా బ్రిక్స్ పరస్పర సహకారం, భాగస్వామ్యం కోసం మరింత విస్తృతమైన వేదికగా ఎదిగిందని గుర్తు చేసుకున్నారు.

భారత్ అధ్యక్షతన బ్రిక్స్ సదస్సు

2012, 2016, 2021లలో భారత్ బ్రిక్స్ సదస్సుకు అధ్యక్షత వహించింది. 2026లో నాలుగోసారి ఈ శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షత వహించనుంది. 'స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం' అనే ఇతివృత్తంతో ఇండియా బ్రిక్స్ సదస్సుకు అధ్యక్షత వహించనుంది. కాగా, బ్రిక్స్‌ కూటమిలో 2024లో ఇరాన్‌తోపాటు ఈజిప్టు, ఇథియోపియా, యూఏఈ దేశాలు చేరాయి. 2025లో ఇండోనేసియా కూడా బ్రిక్స్ కూటమిలో భాగమైంది. దీంతో ప్రస్తుతం పూర్తిస్థాయి బ్రిక్స్ సభ్య దేశాల సంఖ్య 11కు చేరుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్