వాంగ్‌చుక్‌కు భారీ మద్దతు
కేంద్రం నిర్లక్ష్యం చేస్తే రాజకీయ ప్రతిఘటన : కేజ్రీవాల్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నీట్ ప్రశ్నాపత్రం లీక్, సిబిఎస్ఇ అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్ధతుగా సిజెపి కార్యకర్తలతో సహా వందలాది మంది విద్యార్థులు, యువత సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. జంతర్‌మంతర్ వద్ద ఎస్ఎఫ్ఐ నిరసన స్థలమైన క్రాంతి కార్నర్‌లోనే 30 మందికి పైగా విద్యార్థులు ఆహారం తీసుకోకుండా నిరసన తెలిపారు. ఈ సంధర్భంగా సిజెపి ఆందోళనకు, వాంగ్‌చుక్ దీక్షకు అనేకమంది రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు సంఘీభావం తెలిపారు.
కేజ్రీవాల్ సంఘీభావం
ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంఘీభావం తెలిపారు. పరీక్షల విధానంపై యువత చేస్తున్న నిరసనలను కేంద్రం నిర్లక్ష్యం చేయొద్దని, అలా యువతను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వానికే నష్టమని అన్నారు. యువతను, సోనమ్ వాంగ్‌చుక్ మాటలు పట్టించుకోకపోతే, రాజకీయ మూల్యం చెల్లించుకుంటాయని అన్నారు. విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం, సంస్కరణలు కోరుతూ విద్యార్థులకు విశ్వసనీయమైన గొంతుకగా వాంగ్‌చుక్ ఎదిగినందుకే ప్రధాని మోడీ ఆయనకు భయపడుతున్నారని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించి, సోనమ్ వాంగ్‌చుక్‌ను విద్యాశాఖ మంత్రిని చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ తికాయత్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపి డింపుల్ యాదవ్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ కూడా వాంగ్‌చుక్‌ను పరామర్శించి సంఘీభావం తెలిపారు.
సోషల్ మీడియాలో కూడా చాలా మంది మద్దతుగా నిలిచారు. నటులు అతుల్ కులకర్ణి, సోనాక్షి సిన్హా, ఇమ్రాన్ ఖాన్, ఫాతిమా సనా షేక్, శివాంగిత్ పరిహార్, సయాజీ షిండే, గీత రచయిత విశాల్ దల్దానీ తమ మద్దతును తెలియజేశారు. విద్యా వ్యవస్థ పనితీరుపై సోనమ్ వాంగ్‌చుక్ వ్యక్తం చేసిన ఆందోళనలకు తాము మద్దతు ఇస్తున్నామని, ఆయన నిరాహార దీక్ష విరమించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు.
20న పార్లమెంట్ మార్చ్
ఈ నెల 20న పార్లమెంట్ మార్చ్‌కు సిజెపి పిలుపునిచ్చింది. ఈ మార్చ్‌కు 1.5 లక్షల మంది సంఘీభావం తెలిపారని సిజెపి పేర్కొంది. సిజెపి నిరసన గురువారంతో 26 రోజులు పూర్తయింది. వాంగ్‌చుక్ నిరాహార దీక్ష 19 రోజు పూర్తి చేసుకుంది. వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఈ ఆందోళనను పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వాంగ్‌చుక్‌కు అవసరమైన వైద్యసాయం అందించండి : హైకోర్టు
పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షతో ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వాంగ్‌చుక్ దీక్షకు సంబంధించిన పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైతే వైద్య సాయం అందించాలని కేంద్రంతోపాటు ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. ప్రతి ప్రాణం విలువైందేనన్న న్యాయస్థానం, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను వాంగ్‌చుక్ ఆరోగ్యం గురించి ప్రశ్నించింది. 19 రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో వాంగ్‌చుక్ ఆరోగ్యం విషమిస్తోంది. ఆయన దీక్ష విరమించాలని ప్రతిపక్ష నేతలు కోరుతున్నారు.







కామెంట్‌లు (0)