న్యూఢిల్లీ : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. ఆయనపై నమోదైన క్రిమినల్ పరువునష్టం కేసును, ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. రాహుల్‌గాంధీపై కేసు నమోదుకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, ఇప్పటివరకు ఎటువంటి అనుమతి మంజూరు కాలేదని జస్టిస్ దిపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ పిటిషన్‌కు అనుమతి అవసరమని, కానీ అటువంటి అనుమతి లేదని అన్నారు. అనుమతి లేకపోతే, కేసు కూడా లేనట్లేనని, మీరు చట్టాన్ని అనుసరించాల్సిందేనని జస్టిస్ దత్తా రాష్ట్ర ప్రభుత్వం మరియు ఫిర్యాదుదారును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. లక్నోకి చెందిన న్యాయవాది నృపేంద్ర పాండే దాఖలు చేసిన కేసును, లక్నో మెజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన సమన్లను రెండింటినీ కొట్టివేశారు.
2022 నవంబర్ 17న మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో జరిగిన 'భారత్ జోడో యాత్ర'లో, సావర్కర్‌పై రాహుల్‌గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఈ కేసును నమోదు చేశారు. ఈ దశలో హైకోర్టు జోక్యం అవసరం లేదని పేర్కొంటూ, రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్‌ను దాఖలు చేయవచ్చని 2025 ఏప్రిల్ 4న హైకోర్టు లక్నో ధర్మాసనం తెలిపింది. తనపై జరుగుతున్న విచారణను సవాలు చేస్తూనే, ఈ కేసులో తనకు సమన్లు జారీ చేస్తూ దిగువ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు.








కామెంట్‌లు (0)