శుక్రవారం, 17 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓటర్ జాబితాలో పేరు లేకున్నా పౌరసత్వం పోదు

1 గంట క్రితం

Supreme Court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 01:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- ఇసి నిర్ణయించలేదు, 
కేంద్రమే నిర్ణయించాలి

- స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

​ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో

ఓటర్ల జాబితాలో పేరు లేకున్నా పౌరసత్వం పోదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ విషయాన్ని పేర్కొనట్లు గుర్తు చేసింది. పౌరసత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం(ఇసిఐ) నిర్ణయించలేదని, రాజ్యాంగబద్ధంగా ఈ అధికారం ఇసిఐకి లేదని, కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని నిర్ణయించాలని తెలిపింది. ‘ఎన్నికల సంఘానికి కేవలం ఓటర్ జాబితా, పర్యవేక్షణ అధికారం మాత్రమే ఉంది. పౌరసత్వాన్ని నిర్ణయించలేదు’ అని మరోసారి స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించినంత మాత్రాన... పౌరసత్వాన్ని రద్దు చేయడానికి ఇది కారణం కాకూడదని అభిప్రాయపడింది. అనుమానంతో ఓటు తీసేసిన పేర్లను కేంద్రానికి పంపాల్సిన బాధ్యత ఇసిఐ పై ఉందని గుర్తు చేసింది. కేంద్రం ఈ విషయంలో నిర్ణయం తీసుకునే వరకు బాధితుల పౌరసత్వం పోదని తేల్చి చెప్పింది. పశ్చిమ బెంగాల్ లో చేపట్టిన సర్ ప్రకియ ద్వారా ఓటర్ జాబితా నుంచి తొలగించబడిన వ్యక్తులు అప్పీల్ కు వెళ్లగా... అప్పీళ్ల ప్రత్యేక ట్రిబ్యునల్ ముందు విచారణ జరుగుతోంది. సర్ తో ఓటర్ జాబితా నుంచి తొలగించిన వారికి బెంగాల్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరాకరించడాన్ని ప్రసేన్ జిత్ బోస్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సర్ ప్రక్రియలో పేర్లు తొలగించబడిన ఓటర్ల కోసం అప్పీళ్ల విధానం క్రమబద్దీకరించి అందుబాటులోకి తీసుకురావడానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. నియోజక వర్గాల వారీగా డేటాను బహిర్గతం చేయడం, ప్రక్రియను నియంత్రించే ప్రామాణిక కార్యాచరణ విధానం(ఎస్ఒపి) ప్రచురణ ద్వారా ప్రక్రియ మరింత పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. ఈ పిటిషన్ శుక్రవారం సిజెఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల్య బాగ్చి, జస్టిస్ వి మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకర నారాయణన్ వాదనలు వినిపించారు. ఓట్లు తొలగించిన వెంటనే సంక్షేమ పథకాలను దూరం చేశారు.

సర్ తో ప్రక్రియతో ఓటర్ జాబితా నుంచి పేరు కోల్పోయిన దాదాపు 34 లక్షల అప్పీళ్లు ట్రిబ్యునల్ ముందు పెండింగ్ దశలోనే ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇప్పటి వరకు 38 వేల అప్పీలే పరిష్కారమైనట్లు నివేదించారు. ఈ అప్పీళ్ల విచారణ ప్రాథమిక దశలో విచారణలో ఉండగానే... జాబితా నుంచి పేరు తొలగించబడిన వారికి బెంగాల్ ప్రభుత్వం ప్రజా పంపిణి వ్యవస్థ (పిడిఎస్) కింద సంక్షేమ ప్రథకాలు అందించడం లేదని శంకర నారాయణ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ‘పిడిఎస్, అన్నపూర్ణ వంటి సంక్షేమ పథకాలను స్థానిక ప్రభుత్వం నిరాకరించేలా నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ బాధిత వ్యక్తులకు కుల ధ్రువీకరణ ప్రత్రాలు కూడా నిరాకరిస్తున్నారు. ఈ దశలో ట్రిబ్యునల్‌ ‌సహాయపడటానికి, పారదర్శకత, జవాబుదారీతనం ఉండే కొన్ని అంశాలను కోర్టుకు సమర్పిస్తున్నాం’ అని తెలిపారు. దీనిపై జస్టి బాగ్చి జోక్యం చేసుకొని... పౌరసత్వాన్ని నిర్ణయించే రాజ్యాంగబద్ధమైన అధికారం ఇసిఐ కి లేదన్నారు. సందేహాస్పద పౌరసత్వం కారణంగా ఒక వ్యక్తి ఓటర్ల జాబితా నుంచి తొలగించిన తర్వాత... వారి పౌరసత్వ హోదాను నిర్ధారించడానికి కేంద్రానికి దరఖాస్తు చేసుకోవాల్సిన బాధ్యత ఇసిఐ పైనే ఉందని అభిప్రాయపడ్డారు. ‘బీహార్ సర్ తీర్పులో ఒక నిర్ణయం వెలువడిన వెంటనే… పౌరసత్వ చట్టం కింద విచారణ కోసం దానిని కేంద్ర మంత్రిత్వ శాఖకు నివేదించాల్సిన బాధ్యత ఇసిఐకి ఉందని స్పష్టం చేశాం. అలా చేయని పక్షంలో, యథాతథ స్థితిని కొనసాగాల్సిందే’ అని జస్టిస్ బాగ్చి గుర్తు చేశారు. దీనిపై గోపాల్ శంకర నారాయణ్ స్పందిస్తూ... సర్ ప్రక్రియ తర్వాత తొలగించడడిన వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర ప్రయోజనాలను నిరాకరిస్తాయని ఎవరూ ఊహించలేదన్నారు. గత తీర్పు సందర్భంగానే... ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారికి పౌర హక్కులు తీసివేయవద్దనే వ్యాఖ్యాన్ని జోడించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నట్లు నివేదించారు. పౌరసత్వానికి పాస్ పోర్ట్ ‘క్లియర్ పాస్’గా ఉండాలని వాదించారు. జాబితా నుంచి తొలగించిన వారికి సంక్షేమ పథకాలను నిరాకరించారా? లేదా? అనే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్ పై కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ప‌శ్చిమ‌ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప‌శ్చిమ బెంగాల్‌ సర్ పై దాఖలైన పిటిషన్లతో కలిపి ఈ పిటిషన్ ను జత చేసింది. ఆగష్టు 25 న వీటిపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్