- సిఐటియు విమర్శ
న్యూఢిల్లీ : ‘పరిశ్రమ’ నిర్వచనం కేసులో సుప్రీం కోర్టు భారతదేశ కార్మిక వర్గాన్ని నిరాశపరిచిందని సిఐటియు పేర్కొంది. రాజ్యాంగం నిర్దేశించిన కార్మికుల హక్కులను కాపాడడంతో అటూ శాసన వ్యవస్థ (పార్లమెంట్) ఇటు న్యాయ వ్యవస్థ రెండూ విఫలమయ్యాయని సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎలమరం కరీమ్ అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. జాతి సంపద సృష్టిస్తున్న కార్మికలోకం ఇప్పటికే అనేక హక్కులను కోల్పోయిందని, దానికి తోడు అదనంగా హక్కులను నష్టపోవడానికి తాజాగా సుప్రీం తీర్పు అదనపు అధికారాలను ఇచ్చిందని సిఐటియు విమర్శించింది. ఈ తరుణంలో కార్మిక చట్టాలపై పోరాటం కొనసాగించాలని సిఐటియు కార్మిక లోకానికి పిలుపునిచ్చింది. చట్టం వర్తింపునకు సంబంధించిన పరిమితులను పెంచడం ద్వారా మొత్తంగా కార్మిక చట్టాల క్రోడీకరణ ప్రక్రియ ముఖ్యంగా పారిశ్రామిక సంబంధాల కోడ్, 2020 ఇప్పటికే లక్షలాదిమంది కార్మికులను ఈ చట్టాల పరిధి నుండి మినహయించాయి. అంటే వారికి చట్టపరమైన ఎలాంటి రక్షణ వుండదు. ఇప్పడు సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో ఈ క్రూరమైన మినహాయింపులకు మరింత బలాన్ని ఇచ్చినట్లైంది. ప్రజలకు అది కూడా కార్మికులకు చట్టపరమైన రక్షణను నిరాకరిస్తూ, కార్పొరేట్ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరించిందని సిఐటియు విమర్శించింది. కార్మిక లోకం కష్టపడి సాధించుకున్న హక్కులను వారి నుండి నిర్దాక్షిణ్యంగా దూరం చేస్తున్న నయా ఉదారవాద వ్యవస్థకు అనుకూలంగా వ్యవహరించడం తప్ప ఈ తీర్పు మరొకటి కాదని విమర్శించింది.







కామెంట్‌లు (0)