శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసుప్రీంకోర్టు పర్యటనకు బ్రేక్‌

1 రోజు క్రితం

supreem
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 12:32 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ప్రతిపక్షాల అభ్యంతరాలతో వెనక్కి తగ్గిన ‘ఒకే దేశం–ఒకే ఎన్నికలు’ కమిటీ

  • సిట్టింగ్‌ జడ్జిలతో చర్చించడం సరైన సంప్రదాయం కాదన్న కపిల్‌ సిబల్‌

​న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదనపై పరిశీలిస్తున్న పార్లమెంటరీ సంయుక్త కమిటీ.. సుప్రీంకోర్టు పర్యటనను రద్దు చేసుకుంది. అక్టోబర్‌ 6న సుప్రీంకోర్టుకు వెళ్లి సిట్టింగ్‌ న్యాయమూర్తులతో సమావేశం కావాలన్న నిర్ణయంపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్షానికి చెందిన ఓ ఎంపీ కమిటీ చైర్మెన్‌ పి.పి. చౌధరికి లేఖ రాస్తూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర సిట్టింగ్‌ జడ్జిలతో ప్రతిపాదిత బిల్లుపై చర్చించడం వల్ల పార్లమెంట్‌, న్యాయవ్యవస్థ మధ్య ఉన్న అధికారాల విభజనపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాలు రూపొందించడం పార్లమెంట్‌ బాధ్యత కాగా, ఆ చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అన్నది పరిశీలించడం న్యాయవ్యవస్థ బాధ్యత అని ఆ ఎంపీ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ బిల్లులు సుప్రీంకోర్టు ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ప్రస్తుత సిట్టింగ్‌ న్యాయమూర్తుల అభిప్రాయాలను చట్టం రూపొందించే ప్రక్రియలో భాగంగా తీసుకోవడం రెండు వ్యవస్థల మధ్య అనవసరమైన కలయికకు దారితీయవచ్చని అభిప్రాయపడ్డారు.

​రాజ్యాంగ విరుద్ధం : కపిల్‌ సిబల్‌

ఈ అంశంపై స్వతంత్ర రాజ్యసభ సభ్యుడు, సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పార్లమెంటరీ కమిటీ సమావేశం కావడం ‘రాజ్యాంగ విరుద్ధం’ అని ఆయన వివరించారు. భవిష్యత్తులో కోర్టులో సవాల్‌ అయ్యే అవకాశం ఉన్న చట్టంపై పార్లమెంటరీ కమిటీ సిట్టింగ్‌ జడ్జిలతో చర్చించిన ఉదాహరణ తనకు తెలియదని చెప్పారు. అయితే కమిటీ చైర్మెన్‌ పి.పి. చౌధరి మాత్రం పర్యటనను రద్దు చేయలేదనీ, షెడ్యూల్‌ సమస్యల కారణంగా వాయిదా వేశామని తెలిపారు. తనకు ఇతర కార్యక్రమాలు కూడా ఉన్నాయని చెప్పారు. ​ప్రస్తుతం ఈ సంయుక్త కమిటీ రాజ్యాంగం (129వ సవరణ) బిల్లు–2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు–2024లను పరిశీలిస్తోంది. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చట్టపరమైన వ్యవస్థను ఈ బిల్లులు ప్రతిపాదిస్తున్నాయి. ఈ రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వం 2024 డిసెంబర్‌లో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అనంతరం వాటిని పార్లమెంటరీ సంయుక్త కమిటీ పరిశీలనకు పంపారు. సుప్రీంకోర్టు పర్యటనపై ప్రతిపక్షాల అభ్యంతరాలు, పార్లమెంట్‌–న్యాయవ్యవస్థ మధ్య అధికారాల విభజనపై చర్చకు దారితీయడంతో.. ‘ఒకే దేశం–ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనపై పార్లమెంటరీ పరిశీలన మరోసారి ఆసక్తికరంగా మారింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్