సుప్రీంలో సిపిఎం ఎంపి రహీమ్ పిటీషన్
న్యూఢిల్లీ : నీట్ పేపర్ లీక్‌లపై కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో వాటిలో పాల్గొన్న విద్యార్ధులు, వ్యక్తులపై ఢిల్లీ పోలీసులు ముఖాల గుర్తింపు సాంకేతికతను ఉపయోగించడం, అనుబంధ మూకుమ్మడి నిఘా చర్యలు చేపట్టడాన్ని ప్రశ్నిస్తూ రాజ్యసభ ఎంపీ ఎ.ఎ.రహీమ్ మంగళవారం సుప్రీంను ఆశ్రయించారు. ఇటువంటి నిఘాను అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ జ్యుడీషియల్ డిక్లరేషన్ ఇవ్వాలని తన పిటిషన్‌లో ఆయన కోరారు. సరైన చట్టం లేకుండా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై ఇలా ముఖాల గుర్తింపు సాంకేతికతను ప్రయోగించడం, ఇతర నిఘా చర్యలు చేపట్టడం వంటివి తక్షణమే విరమించుకోవాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేయాలని తన పిటిషన్‌లో రహీం కోరారు. జులై 20న జంతర్ మంతర్ వద్ద నిరసనలు ఆరంభమైనప్పటి నుండి ఢిల్లీ పోలీసులు వేలాదిమంది ఆందోళనకారులు, జర్నలిస్టులు, సాధారణ పౌరుల బయోమెట్రిక్ వివరాలు సేకరించారని పిటిషన్ పేర్కొంది. పైగా ఈ డేటాను శాశ్వత జాతీయ క్రిమినల్ డేటాబేస్‌లకు అనుసంథానిస్తారని అన్నారు. సిసిటివి కెమెరాలు, డ్రోన్లు, మొబైల్ కమాండ్, కంట్రోల్ వాహనం, చేతుల్లో వుండే పరికరాల ద్వారా వీడియోలు, ఫోటోలు సేకరించి, నిఘాను అమలు చేశారని పిటిషన్ పేర్కొంది. చట్టబద్ధంగా ఒకచోటకు చేరిన వారిపై బయోమెట్రిక్ నిఘా చేపట్టేందుకు అటు ఢిల్లీ పోలీసులకు స్వంత ఆదేశాలు జారీ చేయలేదని ఇటు క్రిమినల్ ప్రొసీజర్ (గుర్తింపు) చట్టం, 2022 కూడా అధికారమివ్వలేదని ఆ పిటిషన్ పేర్కొంది. ఆందోళనలు జరుగుతున్న ప్రాంతంలో ఇలా నిఘా చేపట్టిన స్థాయి, తీరు అన్నీ రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద గోప్యతా హక్కును ఉల్లంఘించాయని రహీమ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)