- హోం మంత్రికి డిఎస్‌ఎంఎం లేఖ
న్యూఢిల్లీ, : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై కుల వివక్ష, అంటరానితనానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని దళిత సోషణ్ ముక్తిమంచ్ (డిఎస్‌ఎంఎం) డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు డిఎస్‌ఎంఎం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.రాధాకృష్ణన్, రామచంద్ర డోమ్ లేఖ రాశారు. ఉత్తరాఖండ్ హల్ద్వనీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఈ నెల 8న జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించారని, ఈ నెల 10న ఆ ప్రాంతాన్ని శుద్ధి చేశారని ఆరోపణలు వచ్చాయని ఆ లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా అంటరానితనానికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నివారణ చట్టం, 1989 కింద తక్షణం చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఈ నెల 13న పార్లమెంట్‌లో ఖర్గే స్వయంగా లేవనెత్తిన విషయాన్ని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని, దేశ చట్టాలను శ్రీరామ్ సేన ధర్మత్ సేవా న్యాస్, ఇతర బాధ్యులు దిక్కరించారని మీడియాలో కథనాలు వచ్చాయని పేర్కొన్నారు. కులతత్వ మనస్తత్వంతో దళితుల పట్ల ద్వేషంతో నిందితులు వ్యవహరించారని విమర్శించారు. కేంద్రంలోనూ, ఉత్తరాఖండ్‌లోనూ అధికారంలో ఉన్న పార్టీ ప్రోత్సహిస్తున్న మనువాద భావజాలం నేపథ్యంలోనే ఈ చర్య జరిగిందని, గతంలోనూ ఎందరో ప్రముఖులు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. చట్టబద్ధమైన పాలనను, రాజ్యాంగ విలువలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ ఘటన నిరూపించిందని పేర్కొన్నారు. ఈ రాజ్యాంగ విరుద్ధమైన చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్న బాధ్యులైన అధికారులు కూడా పర్యవసానాలను ఎదుర్కోవాలని స్పష్టం చేసింది. రాజ్యాంగ విలువలను పరిరక్షించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తక్షణమే జోక్యం చేసుకోవాలని డిఎస్ఎంఎం కోరింది.







కామెంట్‌లు (0)