శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

దేశాన్ని పునర్నిర్మించాలి

1 గంట క్రితం

ma baby
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 01:03 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- సిపిఎం కేంద్ర కార్యాల‌యంలో జాతీయ పతాకావిష్కరణలో
ఎంఎ బేబీ

- దేశవ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యాన వేడుకలు

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో ఒక‌ప‌క్క పేద‌రికం, ఆక‌లి, నిరుద్యోగం ఉంద‌ని, మ‌రోవైపు అంబానీ, అదానీ వంటి బిలియ‌నీర్లు పుట్టుకొస్తున్నార‌ని సిపిఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంఎ బేబీ అన్నారు. ప్రతి వ్య‌క్తికి గౌరవప్రదమైన, సంతోషకరమైన జీవితాన్ని అందించే సమానత్వ, సుందరమైన సమాజంగా భారతదేశాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 80వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకల్లో భాగంగా శ‌నివారం సిపిఎం కేంద్ర కమిటీ కార్యాలయంలో ఎంఎ బేబీ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. ఈ సంద‌ర్భంగా ఎంఎ బేబీ మాట్లాడుతూ దేశ ప్ర‌జ‌లందరికీ స్వాతంత్య్ర‌ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర‌ వచ్చి ఎనభై ఏళ్లు గడిచాక, ఒక స్వతంత్ర సార్వభౌమ దేశంగా మనం చెప్పుకోదగ్గ పురోగతిని సాధించామ‌ని అన్నారు. అదే సమయంలో లక్షలాది మంది విద్యావంతులైన యువత నిరుద్యోగులుగానే మిగిలిపోయార‌ని పేర్కొన్నారు. కోట్లాది మంది భారతీయులకు కనీస అర్థవంతమైన అవకాశాలు కూడా లభించడం లేద‌ని అన్నారు. ఒకవైపు అంబానీ, అదానీ వంటి బిలియనీర్లు ఆవిర్భవిస్తున్నార‌ని, మరోవైపు పేదరికం, ఆకలి, నిరుద్యోగం, పోషకాహార లోపం, నిరక్షరాస్యత వంటి అన్ని రకాల సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఎర్ర జెండా ఉద్యమం, సిపిఎం, ఇతర వామపక్ష, లౌకిక పార్టీలు ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నాయని అన్నారు. స్వాతంత్య్ర‌ దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ చేసిన “దిమాగీ నక్సల్” వ్యాఖ్యపై ఎంఎ బేబీ స్పందించారు. వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులపై, అలాగే ప్రశ్నలు లేవనెత్తే వారందరిపై మోడీ ప్రభుత్వం దాడికి ప్రణాళిక రచిస్తోందని ఆ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ఇది ప్రజాస్వామ్య హక్కులకు, పౌర స్వేచ్ఛలకు పెద్ద ముప్పు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, తపన్ సేన్, కేంద్ర కమిటీ సభ్యుడు మురళీధరన్, ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి సృజన్ భట్టాచార్య కూడా పాల్గొన్నారు.

దేశ‌వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో వేడుక‌లు

దేశ రాజ‌ధాని ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాల్లో సిపిఎం ఆధ్వ‌ర్యాన స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. కేర‌ళ‌ రాజధాని తిరువ‌నంత‌పురంలో సిపిఎం రాష్ట్ర కార్యాల‌యం వ‌ద్ద సిపిఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి ఎంవి గోవింద‌న్ జెండాను ఆవిష్క‌రించారు. క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో ఎమ్మెల్యే కార్యాల‌యం వ‌ద్ద కేర‌ళ మాజీ ముఖ్య‌మంత్రి, సిపిఎం పొలిట్ బ్యూరో స‌భ్యులు, ప్ర‌తిప‌క్ష నేత‌ పిన‌ర‌యి విజ‌య‌న్ జాతీయ పతాకాన్ని ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా విజయన్‌ మాట్లాడుతూ మన స్వాతంత్య్ర‌ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన ఆదర్శాలను గౌరవిద్దామ‌ని, మన గణతంత్ర రాజ్యపు ప్రజాస్వామ్య, లౌకిక పునాదుల పట్ల మన నిబద్ధతను చాటి చెబుదామ‌ని అన్నారు. మతతత్వం, ద్వేషం మన సామాజిక నిర్మాణాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో, మనం భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తిని, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ అనే రాజ్యాంగ వాగ్దానాన్ని కాపాడుకోవాల‌ని పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు గౌరవంగా, తాను ఈ దేశానికి చెందినవాడిననే భావనతో జీవించగలిగే భారతదేశాన్ని నిర్మించడానికి మనమందరం ఏకమవుదామ‌ని అన్నారు. ప్ర‌జ‌లంద‌రికీ స్వాతంత్య్ర‌ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ప‌శ్చిమ బెంగాల్ లోని రాష్ట్ర కార్యాల‌యంలో సిపిఎం సీనియ‌ర్ నేత‌, లెఫ్ట్ ఫ్రంట్ చైర్మ‌న్ బిమ‌న్ బ‌సు జెండా ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో సిపిఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి ఎండి స‌లీం, పొలిట్ బ్యూరో స‌భ్యులు రామ‌చంద్ర‌న్ డోమ్‌, సీనియ‌ర్ నేత సూర్యకాంత్ మిశ్రా త‌దిత‌రులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వామ‌ప‌క్ష పార్టీల ఆధ్వ‌ర్యంలో ప్ర‌ద‌ర్శ‌న‌లు, బ‌హిరంగ స‌భ‌లు జ‌రిగాయి. త్రిపుర‌ రాజ‌ధాని అగ‌ర్త‌ల‌లో సిపిఎం రాష్ట్ర కార్యాల‌యం వ‌ద్ద సిపిఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి జితిన్‌ చౌద‌రి, తమిళ‌నాడులోని సిపిఎం రాష్ట్ర కార్యాల‌యంలో పొలిట్ బ్యూరో స‌భ్యులు కె.బాల‌కృష్ణ‌న్ జాతీయ‌ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, పుదుచ్చేరి, ఒరిస్సా, మ‌హారాష్ట్ర, రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, బీహార్‌, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఢిల్లీ, ఉత్త‌రాఖండ్‌, పంజాబ్‌, హ‌ర్యానా, గుజ‌రాత్‌, జ‌మ్మూకాశ్మీర్‌, గోవా, అండ‌మాన్ నికోబ‌ర్ దీవులతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో సిపిఎం ఆధ్వ‌ర్యాన స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు జ‌రిగాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్