మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాత పుస్తకాలపై పడిన ఏఐ కన్ను: డిజిటలైజేషన్ పేరిట అరుదైన గ్రంథాల విధ్వంసం?

1 గంట క్రితం

ai
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 01:11 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రేసులో సాంకేతిక రంగానికి సరికొత్త ఇంధనం లభించింది. అయితే ఈ రేసులో పాత, వాడేసిన భౌతిక పుస్తకాలు బలిపశువులుగా మారుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఏఐ డెవలపర్లు భారీ ఎత్తున పాత పుస్తకాలను, పత్రికలను కొనుగోలు చేస్తూ, వాటిని 'విధ్వంసకర రీతిలో' స్కాన్ (Destructive Scanning) చేస్తున్నారు. పుస్తకాల బైండింగ్‌ను పూర్తిగా కత్తిరించి, వేగవంతమైన ఆటోమేటెడ్ స్కేనర్లలోకి పేజీలను పంపడం వల్ల ఆ భౌతిక పుస్తకాలు శాశ్వతంగా నాశనమైపోతున్నాయి.

పాత పుస్తకాలకే ఏఐ కంపెనీల ప్రాధాన్యం ఎందుకు?
ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఇంటర్నెట్‌లో లభించే సమాచారంపైనే ఆధారపడితే 'మోడల్ కొలాప్స్' (Model Collapse) అనే సాంకేతిక సమస్య వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ సృష్టించిన డేటా ద్వారానే మళ్లీ ఏఐకి శిక్షణ ఇవ్వడం అనేది ఒక ఫోటోకాపీ ఆధారంగా మరొక ఫోటోకాపీ తీయడం లాంటిదని, దీనివల్ల నాణ్యత దెబ్బతింటుందని గుర్తించారు. అందువల్ల, మానవులు స్వయంగా రాసిన స్వచ్ఛమైన సమాచారం కోసం ఏఐ యుగానికి ముందు (ముఖ్యంగా 1950కి పూర్వం) ప్రచురితమైన పాత పుస్తకాలపై కంపెనీలు దృష్టి సారించాయి.

మరొకవైపు, ఇటీవల వచ్చిన బార్ట్జ్ వర్సెస్ ఆంత్రోపిక్ (2025) కేసు తీర్పు కూడా ఈ ధోరణికి చట్టబద్ధత కల్పించింది. పైరేటెడ్ డిజిటల్ కాపీలను వాడటం నేరమని చెప్పిన కోర్టు, చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భౌతిక పుస్తకాల బైండింగ్ తొలగించి స్కాన్ చేయడం "ఫెయిర్ యూజ్" (Fair Use) కిందకే వస్తుందని తీర్పునిచ్చింది. పైగా, విడివిడి పేజీలను స్కాన్ చేయడం వల్ల వేగం, ఖచ్చితత్వం పెరగడమే కాకుండా ఖర్చు 50 నుండి 75 శాతం వరకు తగ్గుతుండటంతో ఏఐ సంస్థలు ఈ పద్ధతినే ఎంచుకుంటున్నాయి.

చరిత్ర పుటలు శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం!
సాధారణంగా లభించే పుస్తకాల విషయంలో ఇబ్బంది లేకపోయినా, అరుదైన (Rare) పుస్తకాలు, పత్రికల విషయంలో ఈ ప్రక్రియ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

పూర్తిగా అంతరించిపోయే ముప్పు:

ఒక అరుదైన ప్రచురణకు సంబంధించి ప్రపంచంలో కేవలం నాలుగైదు కాపీలు మాత్రమే మిగిలి ఉంటే, వేర్వేరు ఏఐ కంపెనీలు పోటీపడి వాటిని కొనుగోలు చేసి స్కాన్ చేస్తే... ఆ పుస్తకం భౌతికంగా ప్రపంచం నుండి శాశ్వతంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.

కార్పొరేట్ భద్రతలో బంధీ :

గూగుల్ బుక్స్ వంటి సంస్థలు అరుదైన పుస్తకాలను డిజిటలైజ్ చేసినప్పటికీ, పాత కాపీరైట్ చట్టాల భయంతో వాటిని అన్ని దేశాల వినియోగదారులకు అందుబాటులో ఉంచడం లేదు. ఉదాహరణకు, 1875లో భారతదేశంలో ప్రచురితమైన ఒక అరుదైన పత్రికను నేడు భారతదేశంలో ఉన్నవారు చూడలేకపోగా, అమెరికాలోని వినియోగదారులు మాత్రమే చూడగలిగే విపరీత పరిస్థితులు దాపురిస్తున్నాయి.

భారత సాంస్కృతిక వారసత్వానికి గండి :

1800-1950 మధ్యకాలంలో భారతదేశపు మేధోమథనమంతా నాటి సాహితి, సామాజిక పత్రికల ద్వారానే సాగింది. మన దేశంలో సరైన నిర్వహణ లేక పాడైపోయిన ఇటువంటి పత్రికల చివరి కాపీలు ప్రస్తుతం విదేశీ పురాతన డీలర్ల వద్ద మాత్రమే ఉన్నాయి. ఏఐ కంపెనీలు తమ డేటా వేటలో భాగంగా వీటి ప్రాముఖ్యతను గుర్తించకుండానే స్కాన్ చేసి నాశనం చేసే అవకాశం ఉంది.

ఈ ముప్పును అరికట్టడానికి ఏఐ కంపెనీలు కొన్ని నియమాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. 1950 కంటే ముందు నాటి అరుదైన ప్రచురణలను నాశనం చేయకుండా స్కాన్ చేయాలని, అలాగే ఏ కంపెనీ ఏ పుస్తకాన్ని కొనుగోలు చేస్తోందో తెలిపేలా ఒక ఉమ్మడి 'రిజిస్ట్రీ' ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అంతేకాకుండా, స్కాన్ చేసిన ప్రచురణలను ఇంటర్నెట్‌లో ఉచితంగా అందుబాటులో ఉంచితే ఇతర కంపెనీలు మళ్లీ ఆ పుస్తకాలను కొని నాశనం చేయాల్సిన అవసరం ఉండదు.

జ్ఞానాన్ని డిజిటల్ రూపంలో భద్రపరచడం మంచిదే అయినప్పటికీ, ఏఐ కంపెనీలు అరుదైన పుస్తకాలను కేవలం తమ మోడళ్లకు 'ఆహారంగా' చూడకుండా, మానవ నాగరికతకు ప్రతిరూపాలుగా గౌరవించాల్సిన బాధ్యత ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్